కొత్తరకం మామిడి పండ్లకు ‘డాక్టర్ మ్యాంగో’గా పేరు

by vinod kumar |
కొత్తరకం మామిడి పండ్లకు ‘డాక్టర్ మ్యాంగో’గా పేరు
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వైరస్ పై పోరులో.. తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు వైద్యులు. వారి త్యాగానికి, సేవలకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటా, బయటా ఎక్కడ చూసినా.. వారికి ఘనస్వాగతం పలుకుతూ.. పూల వర్షం కురిపిస్తున్నారు. పలు ఆస్పత్రులపై హెలికాప్టర్ల ద్వారా వాయుసేన పూలవర్షం కురిపించడం మనందరం చూశాం. వైద్యులపై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటున్నారు. తాజాగా ‘మ్యాంగో మ్యాన్‌’గా చిరపరిచితుడైన ఉత్తరప్రదేశ్, మలీహాబాద్‌కు చెందిన హాజీ కలీముల్లా ఓ కొత్తరకం మామిడికి ‘డాక్టర్ మ్యాంగో’గా పేరు పెట్టారు. ఆపత్కాలంలో వైద్యుల సేవలకు గుర్తింపుగా మామిడిపండ్లకు ఆ పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు.

ఉత్తరప్రదేశ్, మలీహాబాద్ కు చెందిన హజీ కలీముల్లా విభిన్న రకాల మామిడి వంగడాలను పండిస్తూ గుర్తింపు పొందారు. ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లను పండించి ఔరా అనిపించారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో కూడా సత్కరించింది. మ్యాంగోమాన్ గా ప్రసిద్ధి పొందిన కలీముల్లా మరో సారి కొత్త రకం మామిడి పండ్లను పండించారు. కరోనా కాలంలో సైనికుల్లా ముందుండి పోరాడుతున్న వైద్య బృంద సేవలకు గాను ఆ మామిడి పండ్లకు‘డాక్టర్ మ్యాంగో’గా పేరు పెట్టారు. దశరి రకం మామిడి పండ్లలోనే ఇది మరో రకం. పండ్లలలో రారాజుగా నిలుస్తుంది మామిడి. అందులోనూ దశరి పండ్లకు మధుర ఫలాలుగా పేరుంది. వాటికంటే తియ్యగా ఉండటంతో పాటు, ఎక్కువ కాలం వరకు పాడవుకుండా ఉంటాయి ‘డాక్టర్ మ్యాంగో’. కలీముల్లా ఇలా కొత్త రకం మామిడి పండ్లకు పేరు పెట్టడం తొలిసారేం కాదు. ఇంతకు ముందు 2015లో ఓ రకం మామిడికి భారత ప్రధాని మోదీ పేరు పెట్టగా, 2019 లో మరో రకం మామిడికి ‘అమిత్ షా’ పేరు పెట్టారు. ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మరెంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు.

Tags : corona virus, mango, pm, amith shah, mango man, doctor mango

Advertisement

Next Story

Most Viewed