RK Roja: తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు.. పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
RK Roja: తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు.. పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలను డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారని, జగన్ మీద నిందలు వేసేందుకు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారని, తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై స్పందించిన ఆమె కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు వంద రోజుల పాలనపై ప్రజల్లో తనకు వచ్చిన చెడ్డపేరును డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదని విమర్శలు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. టీటీడీలో సీఎంకు ఎటువంటి సంబంధం ఉండదని నారా లోకేశ్ చెబుతుంటే.. జగన్ దగ్గరుండి లడ్డూలో జంతువుల కొవ్వును కలిపినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈవోగా శ్యామలరావు తిరుమలకు వచ్చి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని జగన్ మీద నింద వేశారని మండిపడ్డారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి చాలమంది వెళ్లారని, లడ్డూ రుచిలో తేడా అనిపిస్తే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు గత ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికే టీటీడీని ఎంచుకొని, తిరుమల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హాయంలో టీటీడీలో మెంబర్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని, తప్పు జరిగిందా? లేదా? వారిని ఎందుకు విచారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల పార్టీలో ఉన్న వారిని ప్రశ్నించకుండా కేవలం జగన్ పై నిందలు వేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. ఇక చివరగా తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని, ఇది చంద్రబాబు చేస్తున్న తప్పు అని తెలిసి, తనకు ఎటువంటి పాపం అంటుకోకుండా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా దేవుడు క్షమించడని, పవన్ చేస్తున్న 11రోజుల దీక్ష ఆయనకు మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక టీటీడీని అడ్డంపెట్టుకొని జగన్ పై నిందలు వేసి, తిరుమల ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే.. తిరుపతికి చెందిన మహిళగా ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.

Next Story

Most Viewed