Komatireddy: కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు.. ఆయన రాగానే కేటీఆర్, హరీశ్ జైలుకే: కోమటిరెడ్డి

by Prasad Jukanti |
Komatireddy: కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు.. ఆయన రాగానే కేటీఆర్, హరీశ్ జైలుకే: కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమృత్ టెండర్లలో అవినీతి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరిగినట్లుగా ఏమైనా ఆధారాలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా తన బినామీ అయిన సత్యం రామలింగరాజు కుమారుడికి చెందిన గజా కన్ స్ట్రక్షన్ కు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఆదివారం మాదాపూర్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచ స్థాయిలో తెలుగు వారి ఇజ్జత్ తీసిన రామలింగరాజు కుమారుడు కేటీఆర్ కు రైట్ హ్యాండ్ అన్నారు. వీరంతా పదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్.. మీరేమి చిన్నపిల్లాడివి కాదు. ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. మీరు ఆరోపిస్తున్నట్లుగా కేంద్రం నుంచి రూ. 8,888 కోట్లు శాంక్షన్ అయినట్లు ఆధారాలు తీసుకొస్తే మేమంతా దేనికైనా సిద్ధమేనన్నారు.

కేసీఆర్ కుటుంబంలో గొడవలు:

కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని అందుకే కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి పదవి తనకు వద్దని కేసీఆర్ అంటున్నారని ఆ పదవి కేటీఆర్, హరీశ్ రావు తనకంటే తనకు కావాలని పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదారాబాద్ కు వస్తే కేటీఆర్, హరీశ్ రావు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. హైదరాబాద్ కు రావొద్దని హరీశ్ రావు, కేటీఆర్ ఇప్పటికే అమెరికాకు వెళ్లి ప్రభాకర్ రావుకు దండం పెట్టి వచ్చారని ఒక వేళ ఆయన వచ్చి అప్రూవర్ గా మారితే వీరికి జైలు తప్పదన్నారు.

ఓర్వలేకపోతున్నారు..

తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే ఓర్వలేకపోతున్నారని పదేళ్లు రాజ్యమేలిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తుడుచుకుపోయిందని అలాంటి మీకు సిగ్గుండాలన్నారు. ఇక మీ పార్టీ ఉండదన్నారు. మీ దోపిడి కుటుంబానికి మా ప్రభుత్వంలో కూడా అవినీతే కనిపిస్తున్నదన్నారు. కేటీఆర్, హరీశ్ రావు బచ్చాగాళ్లు అని వారు ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed