‘అబార్షన్లు’ మా రైట్.. ‘మై బాడీ, మై చాయిస్’.. వద్దనడానికి మీరెవరు?

by saikumar |   ( Updated:2024-11-26 13:32:37.0  )
‘అబార్షన్లు’ మా రైట్.. ‘మై బాడీ, మై చాయిస్’.. వద్దనడానికి మీరెవరు?
X

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఏదో మూల తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చాలా దేశాల్లో లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. అగ్రరాజ్యం అమెరికాలోని మహిళలు మాత్రం ‘అబార్షన్ మా రైట్’ అంటూ నినదిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు ఎలా చేస్తారు? ఆ హక్కు మీకెవరు ఇచ్చారంటూ అక్కడి ఫెడరల్ ప్రభుత్వాలపై విరుచుకపడుతూ రోడ్కెక్కారు. ప్లకార్డులు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.చాలా కాలంగా యూఎస్ మహిళలు గర్భస్రావానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. ఎందుకంటే, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకించారు.తాను అధికారంలోకి వస్తే అబార్షన్లను పూర్తిగా నిరోధిస్తానని ప్రకటించడంతో మహిళల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.

- కట్ట సాయికుమార్

ట్రంప్‌కు ఓటేసిన వారితో ‘నో సెక్స్’

ప్రస్తుతం అమెరికాలోని మహిళలు తమ హక్కుల కోసం వినూత్న నినాదాలిస్తూ ఉద్యమిస్తున్నారు. తమ అబార్షన్ హక్కులను ఫెడరల్ ప్రభుత్వాలు కాలరాస్తే.. ‘నో మ్యారెజ్, నో కిడ్స్, నో డేటింగ్, నో సెక్స్’ వంటి అంశాలను వారు ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఎవరైతే ట్రంప్‌నకు, రిపబ్లికన్ పార్టీకి ఓటు వేసిన మగవారితో ‘సెక్స్’ చేయబోమని కొందరు మహిళలు బాహాటంగానే ప్రకటించారు. తమ హక్కులను గుర్తించని మగవారికి తమ శరీరాన్ని ఇవ్వబోమని, డిస్టెన్స్ మెయింటెన్ చేస్తామని ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల అలబామా, టెక్సాస్ వంటి రాష్ట్రాలు అబార్షన్‌కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. ఇకపోతే మొదటి నుంచి మెజార్టీ రిపబ్లికన్లు అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లోనూ అబార్షన్ హక్కుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాగా, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అబార్షన్ హక్కులను కొనసాగిస్తారా? లేదా రద్దు చేస్తారా? అనేది సమీప భవిష్యత్‌లో తేలనుంది.

50ఏళ్ల నాటి హక్కులకు బ్రేక్..

అమెరికాలో స్త్రీ హక్కుల ఉల్లంఘన కొత్తేమీ కాదు. గతంలో వారికి ఓటు హక్కు ఉండేది కాదు. పురషాధిక్యత, లింగ వివక్ష కారణంగా ఓటు హక్కు, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవేమీ లేవు. ఎన్నో పోరాటాల తర్వాత కాలక్రమేణా అన్ని హక్కులను అతివలు సాధించుకున్నారు. వాటి ఫలితంగానే 1973లో తొలిసారిగా వారికి అబార్షన్ హక్కులు కల్పించబడ్డాయి. ‘రో వర్సెస్ వేడ్’ కేసులో అప్పటి సుప్రీం ధర్మాసనం ప్రెగ్నెంట్ అయిన 3 నెలల తర్వాత కూడా అబార్షన్ చేసుకునేందుకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. ఇది వారికి రాజ్యాంగపరమైర హక్కునూ కల్పిస్తుందని తీర్పులో పేర్కొంది. అయితే, దేశంలో అబార్షన్ల సంఖ్య పెచ్చుమీరడంతో 24 జూన్ 2022లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులోని నాటి తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు మరల పునఃసమీక్షించి కొట్టివేసింది. క్రమశిక్షణ లేని, ఇష్టానుసారంగా అబార్షన్లు చేయించుకోవడం వలన మహిళల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఆ సంప్రదాయం మంచిది కాదని అభిప్రాయపడింది. అబార్షన్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని తీర్పునిచ్చింది. దీంతో గంటల వ్యవధిలోని ఆయా రాష్ట్రాల గవర్నర్లు గర్బస్రావాన్ని నిషేధించగా.. మరో 13 రాష్ట్రాలు మాత్రం మహిళలకు అండగా నిలుస్తూ ఈ తీర్పును వ్యతిరేకించాయి. ఇక సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టగా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్వాగతించారు.

అబార్షన్‌కు ఎప్పుడు అర్హులు, పరిమితులు ఏంటి?

చాలా దేశాల్లో మహిళలు అబార్షన్ చేయించుకోవాలంటే అక్కడి ప్రభుత్వాలు కొన్ని తప్పనిసరి షరతులను విధిస్తుంటాయి. ఆ దేశ పౌరులుగా విధిగా వాటిని పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..

1. అనుకోని పరిస్థితుల్లో బిడ్డ గర్భంలో మరణించినప్పుడు..

2. పిండం ఎదుగుదలలో ఎలాంటి మార్పులు లేనపుడు,

3. తల్లికి ప్రాణాపాయం అనుకున్నప్పుడు..

4. కొన్ని అరుదైన సందర్భాల్లో పిండం క్రమరాహిత్యంగా వృద్ధి చెందినప్పుడు..5. ఫిజికల్ డిసబులిటీస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్..6. మెంటల్లీ ఫిట్‌గా లేని మహిళలు సైతం..

7. మైనర్లపై అఘాయిత్యాలు జరినప్పుడు వారు ప్రెగ్నెంట్ అయిన క్రమంలో కోర్టు లేదా డాక్టర్ల అంగీకారంతో..

అయితే, అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశాల్లోని మహిళలు సామాజిక, ఆర్థిక పరమైన అంశాలను ముడిపెడుతూ అధికంగా అబార్షన్లు చేయించుకుంటున్నారని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి. ఫలితంగా అది దేశ జనాభా క్షీణతకు కారణమవుతోందని, అమెరికా భవిష్యత్ తరాలను ఈ అబార్షన్లు అంతం చేస్తున్నాయని, వృద్ధ జనాభా పెరుగుదలకు కారణం అవుతోందని కొందరు అభిప్రాయపడ్డారు. గర్బస్రావం ప్రకృతి నియమాలకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. జనాభా పునరుత్పాదనలో సమతుల్యం లేకుండా, గర్భస్రావాలను ఇలాగే ప్రోత్సహిస్తే అగ్రరాజ్యం కోటలకు బీటలు వారడం తప్పదని నేషనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంతోనే ట్రంప్, రిపబ్లికన్లు సైతం గర్భస్రావాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ, తమ హక్కులకు భంగం వాటిల్లితే తిరిగి సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని మహిళా నిరసనకారులు వెల్లడించారు.

USలో ప్రతిరోజూ 1500-2500 అబార్షన్లు..

2021లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లెక్కల ప్రకారం.. అమెరికాలోని 48 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ నుంచి మొత్తం 6,25,978 చట్టపరమైన అబార్షన్లు జరిగినట్లు నివేదించింది. ఇది 2020తో పోలిస్తే 0.9% పెరుగుదల కనబరించిది. కానీ 2012 లెక్కలతో పోలిస్తే 10.5% తగ్గుదలను చూపింది. 15–44 ఏళ్ల వయస్సు గల ప్రతి 1,000 మంది మహిళలు పిల్లలకు జన్మనివ్వగా..అందులో అబార్షన్ల సంఖ్య 204, అనగా 11.6 శాతంగా ఉంది. ఇక 2020లో 14.4 శాతం ఉండగా.. 2019లో 14.2 శాతంగా నమోదైంది. అనగా 2021తో పోలిస్తే అంతకుముందు రెండేళ్లలో అబార్షన్ల సంఖ్య 3 నుంచి 4శాతం అధికంగా ఉన్నది. అమెరికాలో సగటున ఒక రోజులో 1,500 నుంచి 2,500 అబార్షన్లు జరుగుతున్నట్లు అంచనా. ఇక 2023లో ప్రతి వెయ్యి మంది మహిళల్లో ఈ అబార్షన్ల రేషియో 15.9శాతానికి చేరిందని గుట్మాచర్ ఇనిస్టిట్యూట్ అధ్యానంలో తేలింది.

ఇండియా సహా అనేక దేశాల్లో అబార్షన్ లీగల్..

మహిళల హక్కులను దృష్టిలో ఉంచుకుని అబార్షన్ రైట్స్‌ను చాలా దేశాలు లీగలైజ్ చేశాయి. కానీ, దేశ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిపుష్టి, అభివృద్దికి అనుగుణంగా అబార్షన్ చట్టాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న, ఆఫ్రికన్ దేశాలు సైతం సవరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కెనడా, ఇండియా, బెల్జియం, ఐర్లాండ్, యూకే, యూఎస్, టునీషియా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాల్లో అబార్షన్ లీగల్. ఇక కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అబార్షన్లను అంగీకరించడం లేదు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు, డెవలప్‌మెంట్ లేకపోవడమే కారణం. ఇక చైనా, జపాన్ లాంటి అగ్రదేశాలు తమ దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా అబార్షన్ పాలసీలను సవరిస్తూ వస్తున్నాయి. గతంలో చైనా వన్ చైల్డ్ పాలసీని తెచ్చి అబార్షన్లను ప్రోత్సహించగా.. ఇప్పుడు అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కారణం డ్రాగన్ కంట్రీలో సంతానం రేటు దారుణంగా పడిపోయి వ్యద్ద్యాప్య జనాభా పెరిగిపోవడమే. ఇక ఇండియాలో 1971లో అబార్షన్‌ను లీగల్ చేయగా.. మెడికల్ టెర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రకారం..కొన్ని సందర్భాల్లో చట్టబద్ధమైన అబార్షన్‌ను 20 నుండి 24 వారాలకు పొడిగించింది. 1971 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, స్త్రీ 20 వారాలలోపు గర్భవతిగా ఉన్నప్పుడే అబార్షన్ చట్టబద్ధం అవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రెగ్నెంట్ మహిళను రక్షించేందుకు గర్భస్రావం తక్షణమే అవసరమని వైద్యులు సూచిస్తే 20 వారాల తర్వాత కూడా అబార్షన్‌ను అనుమతిస్తూ (MTP సవరణ రూల్స్ -2021)ని కేంద్రం నోటిఫై చేసింది. ఈ చట్టాన్ని 2002 డిసెంబర్, 2003 జూన్, 2021లోనూ ప్రభుత్వం సవరించింది.

24 దేశాల్లో గర్భస్రావం పూర్తిగా బ్యాన్..

సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 24 దేశాల్లో మహిళల అబార్షన్‌పై సంపూర్ణంగా నిషేధం కొనసాగుతోంది. అందులో అండోరా, మాల్టా(యూరప్), ఎల్ సాల్వెడార్, హోండురాస్(సెంట్రల్ అమెరికా), సౌత్ కొరియా, సెనెగల్, ఈజిప్టు, ఫిలిప్పిన్స్, లావోస్ (ఆసియా) వంటి తదితర దేశాలు ఉన్నాయి. మరో 50కు పైగా దేశాల్లో కేవలం మహిళల ఆరోగ్యానికి ప్రమాదం అనుకునప్పుడే అబార్షన్లను అనుమతిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed