పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత

by Anukaran |
doctor Kakarla Subbarao
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు కిమ్స్‌ వైద్యుల వెల్లడించారు. కాగా, కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణాజిల్లా పెదముత్తేవి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం బందరు హిందూ కళాశాలలో చేశారు. అనంతరం విశాఖ ఆంధ్రవైద్య కళాశాలలో చేరి 1950లో డాక్టరు పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్ చేశారు. ఆ తరువాత ఉన్నత వైద్య విద్య కోసం అమెరికా వెళ్ళారు. అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షలో 1955లో ఉత్తీర్ణత సాధించారు. న్యూయార్క్, బాల్టిమోర్ నగరాలలోని ఆస్పత్రుల్లో 1954-1956 వరకు పనిచేశారు. అనంతరం 1956లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆపై హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.

ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని అనేక ఆస్పత్రులలో పనిచేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు డాక్టరు కాకర్ల సుబ్బారావు. 1986లో ఎన్టీరామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరారు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక తర్వాత ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత వెంట వెంటనే అందులోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్‌ను తీసుకొచ్చారు కాకర్ల. రేడియాలజిలో అనేక పుస్తకాలు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు రాసిన డాక్టరు కాకర్ల. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.

Advertisement

Next Story