ఎన్ కౌంటర్ లో మరణించిన సృజనక్క ఎవరో తెలుసా..?

by Sridhar Babu |   ( Updated:2020-05-03 11:39:50.0  )
ఎన్ కౌంటర్ లో మరణించిన సృజనక్క ఎవరో తెలుసా..?
X

దిశ, కరీంనగర్: మహారాష్ట్ర గడ్చిరొలి జిల్లా ఏటాపల్లి తాలూకాలోని జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిన్‌భట్టి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సృజనక్క అలియాస్ చిన్నక్క మావోయిస్టు పార్టీలో కీలక నేతగా గుర్తించారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జ్ భార్యగా పోలీసులు చెప్తున్నారు. ఆమె ఇప్పుడు రీజినల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న తర్వాత సి 60 కమెండోలు కూంబింగ్ చేపట్టాయి. ఈ కూంబింగ్ చేస్తున్న కమెండోలపై మావోలు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నక్క చనిపోయిందని చెప్తున్నారు. ఆమె వద్ద ఏకే 47, క్లైమోర్‌మైన్ , విప్లవ సాహిత్యం, స్వాధీనం చేసుకున్నారు. మొదట కసన్‌సూర్ దళం డివిసి కమిటీ బాధ్యురాలిగా పోలీసులు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఆమె మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన నేతగా తెలియడం చర్చనీయాంశం అయింది.

అంగరక్షకులు ఏమయ్యారో..?

మావోయిస్టు పార్టీకి చెందిన రీజినల్ కమిటీ సభ్యురాలు సృజనక్క ఎదురుకాల్పుల ఘటనలో మరణించడం కలకలం లేపింది. ఆమె ఒక్కరే ఈ ఘటనలో చనిపోవడంతో రక్షణ వలయం ఏమైపోయిందో అంతుచిక్కకుండా తయారైంది. మావోయిస్టు పార్టీకి చెందిన ప్లాటూన్ సభ్యులు కూడా ఈమెకు రక్షణ కోసం
ఉంటారని తెలుస్తోంది. సమావేశానికి హాజరయ్యేందుకు చిన్నక్క భామ్రాఘాడ్ అటవీ ప్రాంతానికి వెళ్లినా మిగతా మావోల ఆచూకీ లేకుండా పోవడం అంతుచిక్కకుండా పోయింది. పార్టీ నాయకత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపున నాగ్‌పూర్ ప్రాంతం నుంచి వెలువడిన ఓ ప్రెస్‌నోట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భూంకాల్ సంఘటన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ అరవింద్ సోవాని, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీకాంత్‌ల పేరిట ప్రకటన విడుదల అయింది. ఈ ప్రకటనలో భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు సక్సెస్ కావాలంటే మరిన్ని ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మావోయిస్టులు 2018 ఎన్‌కౌంటర్ ఘటనలో 40 మందిని కోల్పోగా ఇప్పుడు కీలక నేత చనిపోయిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల గాలింపు..?

మావోయిస్టు సృజనక్క అలియాస్ చిన్నక్క అలియాస్ చైతు ఆర్కా ఎన్‌కౌంటర్‌లో మరణించిన కొన్ని గంటల్లోనే భూపాలపల్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మహాముత్తారం మండలం సింగారం, తాడ్వాయి, అటవీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్న గుత్తికోయలు ఉండటంతో వారి అవాస ప్రాంతాల్లోనే పోలీసు బలగాలు సంచరించడం గమనార్హం. అయితే, మూడ్రోజుల కిందట మావోయిస్టు పార్టీకి చెందిన ఓ కీలక నేతతో సన్నిహితంగా ఉన్న యూజీ కేడర్ వ్యక్తి తెలంగాణ పోలీసులకు చిక్కినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టడం అంతుచిక్కకుండా తయారైంది.

Tags: police operations, maoist leader srujana, forest area, telangana

Advertisement

Next Story

Most Viewed