పనిమనిషి భరతం పట్టిన అత్తాకోడళ్లు.. షాకైన తండ్రీకొడుకులు

by Anukaran |   ( Updated:2021-04-03 06:32:50.0  )
మిడసరి అత్త గడసరి కోడలు స్టోరీ
X

దిశ, కథాస్రవంతి: “సిరి.. ఈ రోజు నీకు ఇష్టమైన పులిహోర చేశాను తినమ్మా” అంటూ పులిహోర ఉన్న ప్లేట్‌ని కోడలు శిరీషకు అందించింది అత్త అలివేలు.

“ఒక్క నిమిషం అత్తయ్యా..” అని వంటగదిలోకి వెళ్ళి చేతిలో చిన్న కప్పుతో తిరిగొచ్చింది శిరీష.

“మీకోసం పాలతో స్వీట్ చేశాను.. తినండి అత్తయ్యా” అని స్వీట్ ఉన్న కప్పుని అత్తగారి చేతికిచ్చిందామె.

అప్పుడే బయట నుండి వచ్చిన తండ్రీకొడుకులు ఇదంతా చూసి.. ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు.

“ఆహా.. అత్తాకోడళ్ళు అంటే మీలాగే ఉండాలి.. ఎంత ప్రేమ ఒకరంటే ఒకరికి.. మీలాంటి అత్తాకోడళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు ఈ రోజుల్లో” అంటూ ఆ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు అక్కడే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న అలివేలు మేనమామ చిన్నకొడుకు.

అప్పటివరకూ అతడిని గమనించని తండ్రీకొడుకులు ఇద్దరూ… “మీరెప్పుడొచ్చారు” అని అడిగారు ముక్తకంఠంతో అతనిని.

“అరగంట క్రితం వచ్చాను.. మీరిద్దరూ మార్కెట్ కి వెళ్ళారని చెప్తేనూ.. మిమ్మల్ని కలిసి వెళదామని ఉన్నాను” అన్నాడతను.

అత్తాకోడళ్ళు ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోడానికి గల కారణమేంటో అర్ధమయింది తండ్రీకొడుకులకి.

కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయిపోయాక సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వచ్చినతను.

“ఎలా ఉంది అమ్మాయ్.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసిన పులిహోర” అని అడిగింది అత్త కోడలిని.

“మీలాగే.. పైకి చూడడానికి బాగుంది కానీ లోపలంతా ఒకటే కుళ్ళు వాసన.. ఇంతకీ విరిగిపోయిన పాలతో నేను చేసిన స్వీట్ ఎలా ఉంది అత్తయ్యా” అని అడిగింది కోడలు అత్తని.

“నీలాగే చూపులకు అందంగా ఉంది కానీ తిన్న తరువాత కడుపులో వికారంగా ఉంది నీ గుణం లాగ” అంది అత్త.

రాబోయే యుద్ధాన్ని ముందుగానే ఊహించిన తండ్రీకొడుకులు మెల్లగా అక్కడ నుండి జారుకున్నారు.

అత్తాకోడళ్ళు ఇద్దరూ కాసేపు వాదించుకొని అలసిపోయి పడుకున్నారు.

సాయంత్రం.. అందరూ కూర్చొని టీ తాగుతున్న సమయంలో శిరీష రూం నుండి బయటకు వస్తూ.. “ఈ మధ్య చిరుగుల జీన్స్ లాగా.. చిరుగుల శారీ ఫ్యాషన్ అయిందా అత్తయ్యా?? ఏమి లేదు మొన్న మీరు మా పెళ్లిరోజుకి కొన్న చీరకు చిరుగులు ఉంటేనూ.. తెలుసుకుందామని అడుగుతున్నా” అంది శిరీష అమాయకత్వం నటిస్తూ..”

“ఏమోనమ్మా.. ఆ ఫ్యాషన్లు నాకేం తెలుస్తాయి.. ఆ చిరుగులు ఫ్యాషను కోసం కొట్లో వాళ్ళు పెట్టినవో.. ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నవో కూడా తెలీదాయె నాకు” అంది అలివేలు మూతి ఇంత పొడుగు సాగదీస్తూ..

మూతి ముప్పైఆరు వంకర్లు తిప్పుతున్న కోడలు దగ్గరకి వంటింట్లో నుండి ఒక డబ్బా తీసుకొచ్చి “మీ పుట్టింటి వారు ఆవులు, గేదెలతో పాటు సాలీడ్లను కూడా పెంచుకుంటున్నారా? ఏమీ లేదు వారు పంపిన లడ్డూల డబ్బాలో సాలీడు ఉంటేనూ.. తెలుసుకుందామని అడిగాను” అంది అత్త డబ్బాలో ఉన్న సాలీడుని చూపిస్తూ..

“లేదత్తయ్యా.. వారు పనికొచ్చేవాటినే పెంచుకుంటారు.. ఆ సాలీడు మీరు పెంచుకునేది అనుకుంటా.. మీలాగే లడ్డూలంటే ఇష్టమేమో డబ్బాలో దూరింది.. మీరు సాలీడ్లతో పాటు చీమలు, బొద్దింకలను కూడా పెంచుతూ ఉంటారుగా.. నేను ఏదైనా ఊరెళ్ళి వచ్చేసరికి వంటింటి నిండా అవే దర్శనమిస్తాయి. ఎంత ప్రేమ అత్తయ్యా మీకు మూగ జీవాలంటే..” అని వెటకారంగా సమాధానమిచ్చింది కోడలు పిల్ల.

రాబోయే పరిస్థితిని ముందే పసిగట్టి టీ వేడిగా ఉండడం వలన నోరు కాలుతున్నా పట్టించుకోకుండా గటగటా తాగేసి అక్కడ నుండి ఏదో పనున్నట్టు వెళ్లిపోయారు తండ్రీకొడుకులు.

అత్తాకోడళ్ళు ఇద్దరూ అలిసిపోయేదాక వాదులాడుకొని “గాలిలో దీపం” సీరియల్ వచ్చే సమయం అవడంతో అప్పటిదాకా జరిగినదంతా మర్చిపోయి టీ.వి పెట్టుకొని కూర్చున్నారు.. ఆ సీరియల్ లో హీరోయిన్ కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు.

తరువాత రోజు ఉదయాన్నే పనిమనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీసింది అలివేలు.

“అదేంటమ్మా మీరు తలుపు తీశారు.. కోడలమ్మ ఇంకా నిద్రలేవలేదా? తలుపు తీయడానికి అత్తగారు అని కూడా చూడకుండా మిమ్మల్ని పంపిందా ఆవిడ మహారాణిలా పడుకొని.. ఇదే నేను అయితే నా కోడలు ఇలా చేస్తే జుట్టు పట్టుకొని ఈడ్చేదాన్ని” అంటూ లోపలికి వెళ్ళి పనులు చేయడం మొదలు పెట్టింది.

వెంటనే ఆలోచనలో పడింది అలివేలు.

కోడలు వంట చేయడానికి వంటింట్లోకి వచ్చింది “ఏంటమ్మా.. రోజూ వంట మీరే చేయాలా? ఎన్ని పనులని ఒక్కరే చేస్తారమ్మా.. అదే ఆమె కూతురుతో అయితే ఇలా చేయిస్తుందా? ఆమెను మహారాణిలా చూసుకుంటూ మిమ్మల్ని ఈ ఇంటి పనిమనిషిని చేసింది మీ అత్త. మా అత్త నన్ను ఇలాగే చేస్తే.. ఆమెని ఇంట్లో నుండి బయటకు గెంటేశాను.” అంది పనిమనిషి సింక్ లో గిన్నెలు కడుగుతూ..

శిరీష కూడా ఆలోచనలో పడింది.

పనిమనిషి ఈ మధ్యనే కొత్తగా చేరింది.. ఆమె అంతకుముందు చేసిన ఇళ్లల్లో కూడా ఇలాగే అత్తాకోడళ్లకు గొడవలు పెట్టి ఆనందించేది.

తరువాత రోజు కూడా ఇలానే అత్తాకోడళ్లకు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి.. బాగా నూరిపోసింది.

పనంతా అయిపోయాక వెళ్లిపోబోతున్న ఆమెను ఆపారు అత్తాకోడళ్ళు.. ఇద్దరి మొహాలు కోపంతో బాగా ఎర్రబడ్డాయి.. జుట్టు ముడి వేసుకుని.. చీరను లోపలికి దోపుకుని.. ఎదురెదురు పడ్డారు ఇద్దరూ..

ఇద్దరికీ కాబోయే గొడవని తలుచుకుంటూ.. లోలోపల సంబరపడసాగింది పనిమనిషి.

తండ్రీకొడుకులిద్దరూ.. ఎప్పటికన్నా ఇంకా పెద్ద గొడవ జరిగేలా ఉందని వారినే చూస్తూ ఉండిపోయారు.

ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ కలిసి పనిమనిషి వైపు రావడం మొదలు పెట్టారు.. “నా దగ్గరికి వస్తున్నారేంటి” అని ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెను ఇద్దరూ కలిసి బయటకు గెంటేశారు..

“మేమిద్దరం ఒకరినొకరం ఎన్నైనా అనుకుంటాం.. కానీ మూడో వ్యక్తి వచ్చి ఒకరి ముందు ఇంకొకరిని ఏమైనా అన్నారంటే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇంకెప్పుడూ మా ఇంటివైపుకి రాకు” అని ఆమె మొహం మీద తలుపేసి లోపలికి వచ్చారు అత్తాకోడళ్ళిద్దరూ..

తండ్రీకొడుకులు నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరినీ..

టీ.వి లో తమకిష్టమైన “ఉప్పూ కారం” అనే వంటల ప్రోగ్రాం వస్తుండడంతో అత్తాకోడళ్ళిద్దరూ టీ.వి ఉన్న రూం వైపుకి నడిచారు.

-సాయి స్రవంతి

Advertisement

Next Story

Most Viewed