- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నియంత్రిత సాగు.. అన్నదాత గోడు
దిశ ప్రతినిధి, నల్లగొండ : వరి పంట సాగు విషయంలో అధికారుల ఆరంభ శూరత్వమే తప్ప.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. పంటల సాగు, ధాన్యం దిగుబడిని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యింది. వానాకాలం సాగు సీజనులో పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి అన్నదాతలను వరుణుడు నిండాముంచాడు. దీనికితోడు అధికారులు, పాలకుల అత్యుత్సాహం కారణంగా రైతాంగం మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రిత పంటల సాగు విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్టయ్యింది. అధికార యంత్రాంగం భారీ అంచనాలతో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయడంతో మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళ వాతవరణం ఏర్పడింది. తీరా చూస్తే.. నెలన్నర రోజులు గడవక ముందే కొనుగోలు కేంద్రాలను ఎత్తేసిన పరిస్థితి. అధికారుల అత్యుత్సాహాని రైతులు బలయ్యారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలో..
వానాకాలం సీజనుకు సంబంధించి నల్లగొండ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 4.5 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ, వ్యవసాయ మార్కెట్ల ఆధ్వర్యంలో 180 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం 46 కేంద్రాల్లో మాత్రమే సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కానీ మొత్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో కొనుగోలు చేశారు. అధికారుల వేసిన అంచనాకు ఇది 4 లక్షల మెట్రిక్ టన్నుల తేడా ఉన్నట్టు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ వానాకాలం సీజనులో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, అందులో 9.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటుందని భావించారు. కానీ అత్యంత దయనీయంగా సూర్యాపేట జిల్లాలో కేవలం 1.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే జిల్లావ్యాప్తంగా కొనుగోలు చేయడం గమనార్హం. ఇదిలావుంటే.. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తే.. క్షేత్రస్థాయిలో 10 లక్షల టన్నులు మించలేదు. ఈ క్రమంలోనే ఒక్క నల్లగొండ జిల్లాలోనే 67 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే పూర్తిగా ఎత్తేశారు.
అధికారుల అత్యుత్సాహం.. పోటెత్తిన రైతాంగం..
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే 900 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు మిల్లుల్లో కొనుగోళ్లు అధికమనే చెప్పాలి. అయితే అధికారుల అంచనాకు క్షేత్రస్థాయిలో వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంది. కేవలం దిగుబడి పెరిగిందనే అంచనాతో ధాన్యం త్వరగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో అన్నదాతలు మిల్లులకు బారులుదీరారు. దీన్నే అదునుగా భావించిన మిల్లర్లు ధరను బాగా తగ్గించారు. ఒకనొక దశలో క్వింటాల్ ధాన్యానికి రూ.1880కి పైగా చెల్లించాల్సింది.. అత్యంత కనిష్టంగా రూ.1300 చెల్లించి రైతులను నిలువునా ముంచారు. ఈ క్రమంలోనే అన్నదాతలు ఎన్నో అవస్థలు పడ్డారు. ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్ల విధానం అమల్లోకి తేవడం.. రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలు చేయడం.. ధాన్యాన్ని తగలబెట్టడం వంటి ఘటనలు గత రెండు నెలల కాలంలో నిత్యకృత్యమయ్యాయి.