విభేదాలు వివాదాలు కారాదు: చైనా

by Shamantha N |
విభేదాలు వివాదాలు కారాదు: చైనా
X

హాంకాంగ్: భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై పొరుగుదేశం స్పందించింది. ఇరుదేశాల మిలిటరీ అధికారుల సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయని, విభేదాలు వివాదాలుగా మారొద్దనే మోడీ, జిన్‌పింగ్‌ల ఆలోచనలను ప్రతిఫలించేందుకు అంగీకరించారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలని భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు పలుసార్లు ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు చైనా వైపున గల మోల్డో రీజియన్‌లో శనివారం ఇరుదేశాల సీనియర్ మిలిటరీ అధికారులు భేటీ అయ్యారు. దీనిపై స్పందిస్తూ, దౌత్యపరమైన, మిలిటరీపరమైన విధానాల్లో సరిహద్దు గొడవ సద్దుమణిగే చర్యలు జరిగాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. రెండు దేశాల అధినేతల ఆలోచనలకు అనుగుణంగానే చర్చలు జరుగుతున్నాయని వివరించారు. సరిహద్దులో శాంతి నెలకొనేందుకు, ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించేందుకు రెండువైపులా చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాబట్టి సరిహద్దు ఉద్రిక్తతలు అదుపులోనే ఉన్నాయని, వాటిని నియంత్రించవచ్చునని చెప్పారు. దాని చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed