సంచలనంగా మారిన హెరాయిన్ కేసు.. డీజీపీ సవాంగ్ కీలక ప్రకటన

by srinivas |
DGP-Gautam-sawang comments on Gang Rape Case
X

దిశ, ఏపీ బ్యూరో : గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద మంజీరా మాల్‌లో డీజీపీ.. గంజాయిపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణపై పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు.

గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరినీ చట్టం ముందుకు తీసుకు వస్తామన్నారు.

ఇప్పటికే 463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో గంజాయి సాగు, రవాణాపై లోతైన అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఐఏ సహకారంతో ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న గంజాయితో పోల్చుకుంటే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే అత్యధికమని చెప్పుకొచ్చారు. సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలును మానుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story