సర్వేల్ గురుకుల వ్యవస్థాపక దినోత్సవంకు హాజరైన డీజీపీ..

by Shyam |   ( Updated:2021-11-23 04:01:51.0  )
సర్వేల్ గురుకుల వ్యవస్థాపక దినోత్సవంకు హాజరైన డీజీపీ..
X

దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని సర్వేల్ గురుకుల పాఠశాల వ్యవస్థాపక దినోత్సవానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సర్వేలు గురుకుల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. తను ఈ స్థాయికి ఎదగడానికి సర్వేలు గురుకుల పాఠశాలే పునాది అని అన్నారు. జీవితమంటే సర్వేలు, సర్వేలే నా జీవితంగా కొనసాగిందని తెలిపారు. తను సర్వేలు గురుకుల పాఠశాలలో చేరక ముందు మా స్వగ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించానని అక్కడ నాతో పాటు చదివిన స్నేహితులంతా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తాను కూడా సర్వేలు గురుకులంలో సీటు సంపాదించకపోయి ఉంటే ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని తెలిపారు.

దేశంలోనే రెసిడెన్షియల్ వ్యవస్థకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నాంది పలికారని చెప్పారు. సర్వేల్ గురుకుల పాఠశాల స్ఫూర్తితో దేశంలోని అన్ని జిల్లాల్లో పీవీ నరసింహారావు నవోదయ గురుకులాలను ప్రారంభించారని తెలిపారు. విలువలతో కూడిన విద్యకు సర్వేలు గురుకుల పాఠశాల పెట్టింది పేరు అని ఆ పేరును ప్రస్తుతం విద్యను అభ్యసిస్తోన్న విద్యార్థులు కూడా నిలబెట్టాలని సూచించారు. 1971 సంవత్సరం నవంబర్ 23న స్థాపించిన గురుకుల పాఠశాల నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు ఆయన పాఠశాలలో జెండాను ఆవిష్కరించి పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నూతనంగా నిర్మితమవుతోన్న ఈ గురుకుల పాఠశాల భవనం, వసతిగృహం, క్యాంటీన్ లను ఆయన తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు భవన నిర్మాణంలో పలు సలహాలు సూచనలు అందించారు. అదే విధంగా విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న భోజనంను పరిశీలించి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్వేలు గురుకుల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed