మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ చెట్లను పెంచండి.. పూజించండి..

by Sumithra |   ( Updated:2023-07-01 15:03:34.0  )
మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ చెట్లను పెంచండి.. పూజించండి..
X

దిశ, వెబ్ డెస్క్ : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. చెట్లను నాటి మన పరిసరాలను మనమే కాపాడుకోవాలని చెబుతారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలి. దానికోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్లను నాటాలి. అంతేకాదు వృక్షాలను ఎక్కువగా పెంచడం వలన సకాలంలో వానలుపడి పంటలు బాగా పండుతాయి. అలాగే ఓజోన్‌ పొర దెబ్బతినకుండా ఈ చెట్లు కాపాడతాయి.

సనాతన సాంప్రదాయం ప్రకారం మొక్కలను, చెట్లను పూజించడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ప్రకృతిని ప్రేమించేవారు, దైవం పైన భక్తి శ్రద్దలు ఉన్నవారు మొక్కలను కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఐదు వృక్షాలు ఆరాధనకు యోగ్యమైనవని పండితులు చెబుతున్నారు. ఈ ఐదు మొక్కలను పూజించడం ద్వారా సంపన్నమైన జీవితాన్ని అనుభవించడమే కాకుండా సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పూజలు అందుకునే యోగ్యత ఉన్న ఆ ఐదు వృక్ష్యాలు ఏంటి.. ఏ మొక్కలను ఏ రోజున పూజించాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి మొక్క..

ప్రతిఇంటిలోనూ ఖచ్చితంగా ఉండే మొక్క తులసి మొక్క. ఇది సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపంగా, విష్ణువుమూర్తికి ఎంతో ప్రీతికరమైందిగా భావిస్తారు. ఇంట్లో పెంచుకునే తులసి మొక్కకు నియమనిష్టలతో పూజలు చేయాలి. అలాగే ప్రతి రోజు నీటిని పోయాలి. అలా చేస్తే సకల సంపదలు చేకూరుతాయట. ఆదివారం మాత్రం తులసిమాతకి నీరును పోయరాదని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఏకాదశి రోజున తులసి ఆకులను తుంచడం చేయకూడదట. తులసికి నిత్యం నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ దేవి కూడా సంతృప్తి చెంది, ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది. అంటే కాదు ఈ మెక్కను పూజిస్తే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

​మనీ ప్లాంట్..

చాలా మంది ఇంట్లో మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. చూడడానికి ఎంతో ఆకర్షనీయంగా ఉండే ఈ మొక్క అంత పాజిటిల్ ఎనర్జీని ఇస్తుందట. ఇది వాస్తు ప్రకారం కూడా చాలా ప్రత్యేకమైందిగా చెబుతారు. ఈ మొక్కను ఇంటి పరిసరాలలో మాత్రమే కాకుండా ఇంటిలోపల కూడా పెంచవచ్చు. ఈ మొక్కను పెంచితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

అరటి చెట్టు..

ఇంట్లో పూజలు చేసేటప్పుడు అరటి ఆకులను, అరటి పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అరటి చెట్టు హిందూ ధర్మంలో ఎంతో ప్రత్యేకమైనది. అరటి చెట్టును పూజిస్తే శ్రీహరి సంతృప్తి చెందుతాడని భక్తుల నమ్మకం. ముఖ్యంగా గురువారం అరటి చెట్టును మినపప్పు, బెల్లంతో పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయట. చాలా మంది గురువారం ఉపవాసం ఉండేవారు అరటి చెట్టును పూజించి నీటిని అర్పిస్తారు.

జమ్మి చెట్టు..

హిందూ శాస్త్రాల ప్రకారం జమ్మిచెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జమ్మిచెట్టును ఇంటి నుంచి బయటకు వెళ్లే దిశలో నాటితే శుభం జరుగుతుంది. జమ్మిచెట్టును నాటడం మాత్రమే కాదు ఆ స్థలంలో ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ సాయంత్రం జమ్మిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుందట. అలా చేస్తే వారి ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుందని విశ్వసిస్తారు. వ్యాపారాలు చేసుకునేవారి వ్యాపారం కూడా పురోగమిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి శనివారం జమ్మిచెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.

రావి చెట్టు..

రావిచెట్టు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇది అన్ని చెట్లకంటే ఎక్కువగా ఆక్సిజన్ ను ఇస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పితృదేవతలు రావిచెట్టుపై నివసిస్తారని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ చెట్టును ఆరాధిస్తే వారి ప్రార్థనలు నేరుగా పితృదేవతలకు చేరుతాయని విశ్వాసం. ప్రతి శనివారం రావి చెట్టుపై దీపాన్ని వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

Read More..

బల్లులు ఇంట్లోకి ఎందుకు వస్తాయి..? గృహిణికి లాభమా, నష్టమా..?

కుడి కన్ను అదిరితే శుభం కలగడం వెనుక రహస్యం ఇదే!

Advertisement

Next Story

Most Viewed