నాలుగేళ్లలో కడప రూపురేఖలే మార్చేస్తా..

by srinivas |
నాలుగేళ్లలో కడప రూపురేఖలే మార్చేస్తా..
X

దిశ, ఏపీబ్యూరో: వచ్చే నాలుగేళ్లలో కడప రూపురేఖలు మార్చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఎస్​బీ అంజాద్​బాషా తెలిపారు. శుక్రవారం ఆయన కడప నగరంలోని 35, 36, డివిజన్లలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అంజాద్​ బాషా మాట్లాడుతూ నగరంలోని ప్రతి వీధికి సిమెంటు రోడ్డు నిర్మిస్తామన్నారు. అందులో భాగంగా రూ.15.50 లక్షలు పద్నాలుగో ఫైనాన్స్ నిధులతో సిమెంట్ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 50 డివిజన్లలో రూ.43 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

కరోనా వల్ల అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేసేందుకు ఒక దృఢసంకల్పంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కడప జిల్లా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఆయన మరణానంతరం అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్​జగన్​మోహన్​రెడ్డి కడప జిల్లావాసి కావడం మన అందరి అదృష్టమన్నారు.

కడప జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ఇది ఒక మంచి సువర్ణఅవకాశమని చెప్పారు. కడపలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.480 కోట్లతో డీపీఆర్​లు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడంతోపాటు క్యాన్సర్ ఆస్పత్రి, సైకియాట్రిక్ ఆస్పత్రి నిర్మిస్తామని వివరించారు.

Advertisement

Next Story