అమరచింతలో విజృంభిస్తున్న డెంగ్యూ

by Shyam |
అమరచింతలో విజృంభిస్తున్న డెంగ్యూ
X

దిశ, మహబూబ్‌నగర్: ప్రపంచం మొత్తం నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారితో పోరాటం చేస్తుంటే వనపర్తి జిల్లా అధికార యంత్రాంగం మాత్రం డెంగ్యూ కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అక్కడ కరోనా కోరలు చాచలేదని సంతోషించాలో లేక డెంగ్యూ విజృంభిస్తోందని ఆందోళన చెందాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలను డెంగ్యూ వణికిస్తోంది. వనపర్తి జిల్లాలో కరోనా కేసులు లేవని అక్కడి అధికారులు రిలాక్స్ అయ్యే సమయానికి డెంగ్యూ వచ్చింది. ఈ వ్యాధి కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరచింత మున్సిపాలిటిలో గడిచిన 4 రోజుల్లో సుమారు 70‌పై చిలుకు డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డెంగ్యూ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. డెంగ్యూ కారణంగా చాలా మంది అటు వనపర్తి, ఇటు మహబూబ్ నగర్ ఆస్పత్రులలో చికిత్సలు పొందుతుండగా ఇంకా కొంతమందికి డెంగ్యూ ఉందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే, దోమల బారి నుంచి కాపాడాలని పలుమార్లు అధికారులు, మున్సిపల్ పాలకమండలి సభ్యులకు విన్నవించినా వారు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టికెళ్లినప్పటికీ వారు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో చూపించిన శ్రద్ధ డెంగ్యూపై చూపించలేదని తెలుస్తోంది. మున్సిపాలిటిగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం వైఫల్యమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు.

మున్సిపాలిటి పరిధిలో, పట్టణంలోని పలు వార్డులలో ఎటు చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి అటు పందుల విహారంతోపాటు దోమల బెడద కూడా ఎక్కువగా వుంది. ఎప్పటికపుడు చెత్తను తొలగించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం పట్ల పాలక మండలి దృష్టి సారించలేదు. దీంతో పట్టణంలోని సుమారు 7 వార్డులలో డెంగ్యూ ప్రబలింది. మున్సిపాలిటి పరిధిలో మురుగుకాలువలూ సరిగా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చాలా కాలనీల్లో మురుగు ఒక్కచోటకు చేరుతోంది. దాంతో అక్కడ దోమలు కూడా ఎక్కువ అయ్యాయని ప్రజలు చెబుతున్నారు.

మురుగు కాలువలను వారాల తరబడి శుభ్రం చేయకపోవడంతో కాలువలలో చెత్త పేరుకుపోయింది. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడే రోడ్లతో పాటు ఇళ్ల మధ్యలో మురుగునీరు దర్శనమిస్తోంది. పైగా కాలువల్లో మరింత చెత్త వేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే దుర్వాసన, దోమల ద్వారా విషజ్వరాలు సోకే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఇంకా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టకపోవడం‌పై విమర్శలు వస్తున్నాయి.

అధికారులు డెంగ్యూ నిర్ధారణ అయిన వారిని ఇతర ప్రాంతాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి స్థానికంగా వైద్యులను అందుబాటులో ఉంచి కావాల్సిన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లాక్ డౌన్ కారణంగా అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున స్థానికంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags: dengue, amarachinta muncipality, disease, sanitation

Advertisement

Next Story

Most Viewed