ఢిల్లీకి ఇకనుంచి సొంత విద్యా మండలి

by Shamantha N |
delhi cm aravind kejriwal
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీకి ఇకనుంచి సొంతగా పాఠశాల విద్యా మండలి ఏర్పాటు కానున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరే ఢిల్లీ కూడా సొంతగా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును నిర్వహించనున్నది.

ఢిల్లీలో సుమారు వేయికి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 1,700 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ సీబీఎస్ఈ పరిధి కిందే నడుస్తున్నాయి. అయితే కొద్దిరోజుల్లోనే ఇవన్నీ రాష్ట్ర విద్యామండలి కిందకు వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ ఏడాదిలో 20 నుంచి 25 ప్రభుత్వ పాఠశాలలను స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కిందకు చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఆ ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు. అందుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇందులో బలవంతమేమీ లేదనీ, స్వచ్ఛందంగా వచ్చే పాఠశాలలనే చేర్చుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు.

Advertisement

Next Story