ఓటర్లకే షాక్‌నిచ్చే ఫలితాలా?

by Shamantha N |
ఓటర్లకే షాక్‌నిచ్చే ఫలితాలా?
X

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిఒక్కరికి షాక్ ఇస్తాయి అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసింది. మీడియా సంస్థల సర్వేలు కూడా ఎవరిది గెలుపు అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. బరిలో దిగిన మూడు పార్టీలు హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ఓటర్లకే షాక్ ఇచ్చే ఫలితాలు ఎలా వస్తాయి? అనే అనుమానం ఢిల్లీ ఓటర్లను అయోమయానికి గురి చేస్తోంది.

అమిత్ షా చేసిన వ్యాఖ్యలు… ఓటర్లు ఆశించిన లేదా ఓటేసిన పార్టీ కాకుండా వేరే పార్టీ విజయం సాధిస్తుందా? అన్న అనుమానానికి బీజం వేస్తున్నాయి. గతంలో ఈవీఎంల పనితీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనని తేల్చిన నేపథ్యంలో… ఓటేసిన వారే ఊహించని ఫలితాలంటే.. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేయనున్నారా? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయనున్నారా? ఈసీనే తమ కనుసన్నల్లోకి తీసుకోనున్నారా? ఏదో అక్రమానికి ప్రణాళికలు వేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఓటర్లను వేధిస్తున్నాయి.

ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ట్విట్టర్‌లో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ఫలితాలు అందరికి షాక్ ఇస్తాయని అమిత్ షా ఎందుకు అన్నారు? అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని చాలా మంది భావిస్తున్నట్టు అతనికి తెలుసు అని అర్థమవుతోంది. మరి ఆయనేమైనా.. ఎన్నికలను ప్రభావితం చేసే ప్లాన్‌లు వేస్తున్నారా?’ అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు ‘ఈవీఎం ట్యాంపరింగ్’ అనే పదాన్ని వల్లెవేయడం సాధారణమైపోయింది. ఏమైనా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలను మించిన సీట్లను సాధించిందన్నది నిర్వివాదాంశం. ఆ సందర్భంగా పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ఆర్మీ ఉటంకింపులపైనా ఉదారంగా వ్యవహరించిందని ఈసీపైనా విమర్శలు చేశారు. అయితే, ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన మరో విషయం కలకలం రేపుతున్నది.

2019 ఎన్నికలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది కాకముందే(ఎన్నికలు జరిగిన తర్వాత నాలుగు నెలల తర్వాతే) ఈసీ ధ్వంసం చేసిందన్న వాస్తవాన్ని ఒక మీడియా సంస్థ బట్టబయలు చేయడంతో పెను కలకలం రేగుతోంది. ఈసీ నిబద్దతపై ఈ చర్య ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు, పోలైన ఓట్లకు మధ్య పొంతన కుదరలేదన్న ఆరోపణలున్నాయని, వీవీప్యా్ట్ స్లిప్పుల ధ్వంసంతో వాటిని నిరూపించలేమని ఈసీ వివరించింది. దీంతో 2019 ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వెల్లువెత్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాలను అప్పటి అధికార పార్టీ ప్రభావితం చేసిందా? అప్పటి బీజేపీ భారీ విజయానికి దారితీసిన పరిస్థితులేంటి? అన్న చర్చ మరోసారి వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగుతోంది. ఈవీఎంలను ప్రభావితం చేస్తారా? లేక పోలింగ్ కు ముందు ధనప్రవాహంతో ఓటర్లను కొనుగోలు చేస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాగా, ఇంతకీ బీజేపీ ఎలాంటి ట్విస్టు ఇస్తుందోనని ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

Next Story

Most Viewed