- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అయోమయంలో తెలంగాణ ఆర్టీసీ..
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీని కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. అంతిమంగా ఏం చేస్తారో తెలియడం లేదనే ఆందోళన కార్మికులలో నెలకొంది. తక్షణం ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. సంస్థలో కార్మిక సంఘాలను లేకుండా చేసిన సర్కారు దానిని కాపాడే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటున్నామనే సాకుతో యాజమాన్యం బస్సులకు బ్రేకులు వేస్తోంది. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఆస్తులు, అప్పులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. సంస్థను అమ్మేసేందుకు కారణాలను వెతుకుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి నష్టాలు.. అప్పులు.. తెలంగాణ ఆర్టీసీని నిండా ముంచుతున్నాయి. వేతనాల కోసం పదో తారీఖు దాటిన తర్వాత కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. ఆర్టీసీకి 364 బస్ స్టేషన్లు, 97 డిపోలు, 24 డివిజన్లు, 11 రీజియన్లు ఉన్నాయి. 10,400 బస్సులు రోజుకు 98 లక్షల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాయి. కరోనా కారణంగా ఇది కొంతమేరకు తగ్గిందని అంటున్నారు. ఎంత తగ్గిందో మాత్రం అధికారులు స్పష్టం చేయడం లేదు.
అప్పుల కుప్ప..
ఆర్టీసీ విభజన సమయానికి 2015లో రూ. 2017 కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు అదనంగా రూ. 1890 కోట్లు చేరాయి. రూ. 3,907 కోట్లకు చేరుకున్నాయి. 2018–19లోనే రూ. 928.67 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కూడా నష్టం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదుకుంటామన్న ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కాగితాలలోనే కనిపిస్తున్నాయి. రీయింబర్స్‌మెంట్స్ సకాలంలో రావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని అంటున్నారు. రాయితీల సొమ్ము ఇవ్వకుండా, ఏదో సాయం చేసినట్లుగా ఈ ఏడాది మొక్కుబడిగా రూ. 95 కోట్లు మాత్రమే విడుదల చేశారని అధికారులు చెబుతున్నారు. మిగతా సొమ్మును విడుదల చేస్తే నష్టాల నుంచి గట్టెక్కుతామనే ఆశాభావంతో ఉన్నారు. విధి లేని పరిస్థితులలో యాజమాన్యం కార్మికుల నిధులను వాడుకుంది. సీసీఎస్‌కు సంబంధించిన రూ. 776 కోట్లు, పీఎఫ్‌కు సంబంధించినవి రూ. 750 కోట్లు ఇందులో ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రెండేండ్ల నుంచి చెల్లింపులను నిలిపివేశారు. 49,753 మంది సిబ్బందికి ప్రతి నెలా రూ. 260 కోట్లు వేతనాలుగా చెల్లించాల్సి వస్తోంది.
వ్యాట్ నుంచి మొదలు..
డీజిల్‌పై ప్రభుత్వానికి చెల్లించాల్సిన వ్యాట్ కోసం సంస్థ అప్పు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. ఆర్టీసీ రోజు ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్ వాడుతుంది. ఏడాదికి 20 కోట్ల లీటర్ల దాకా వినియోగిస్తోంది. ఏడాదికి సుమారు రూ. 1,300 కోట్లు డీజిల్ కోసమే ఖర్చవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. దాదాపు రూ. 300 కోట్లు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలలో మాత్రం 10 నుంచి 15 శాతం మాత్రమే వ్యాట్ ఉంది. ఈ క్రమంలోనే బయటకు చెప్పకుండా చాలా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో కార్మికవర్గాలకు తెలియనీయడం లేదు.
డీలక్స్ బస్సులకు స్వస్తి పలికారు. పుష్బ్యాక్ సీట్లు, ఎక్స్‌ప్రెస్ కంటే వేగం, నాన్‌స్టాప్ సర్వీసులతో ఉండే డీలక్స్ బస్సులను కారణాలు లేకుండానే ఆపేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ బస్‌లకు డిమాండ్ ఉంటోంది. రాత్రి పూట ప్రయాణం చేసేవారు డీలక్స్ సర్వీసులకే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకోకానీ ఈ బస్‌లను తిప్పడం లేదు.
వజ్ర బస్సులు మూలకే..
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆసక్తి చూపే వజ్ర బస్సులను మూలకు పడేశారు. ఇంటి ముందుకే బస్సు అనే నినాదంతో ఈ మినీ బస్సులను ప్రవేశపెట్టారు. ఇవి చాలా డిమాండ్‌తో నడిచాయి. నిర్వహణ భారమవుతుందంటూ యాజమాన్యం వీటిని పక్కనేసింది. మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకుని దాదాపు రోజుకు 60 నుంచి 100 ట్రిప్పులు నడిచే వజ్ర బస్సులను ఎందుకు తిప్పడం లేదనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. వాటిని నడిపే ఆలోచన మాత్రం లేదంటున్నారు. గ్రేటర్లో తిప్పిన వొల్వో బస్సులు కూడా ఆగిపోయాయి. వీటిలో కొన్నింటిని సంక్రాంతి పండుగకు ఏపీకి తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులను బయటకు తీయకపోవడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. తుప్పు పడుతున్నాయి. మరో 800 బస్సులు స్క్రాప్‌కు అమ్మేస్తున్నారు. మొబైల్ టాయిలెట్లకు కూడా అమ్ముదామనుకుంటే ఎవరూ ముందుకు రావడం లేదు.
కొత్త బస్సులు లేవు..
జిల్లాలలో ఖాళీగా ఉండే బస్సులను గ్రేటర్‌కు తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలేమీ చేయడం లేదు. ఇక్కడ కొన్ని బస్సులను తిప్పేందుకు అవకాశాలున్నా పరిశీలనకు తీసుకోవడం లేదు. ఇప్పుడు 800 బస్సులు స్క్రాప్‌కు వేస్తున్నా, వీటి స్థానంలో అద్దె బస్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేయడంతో ప్రైవేట్ వాహనాలు జోరుగా నడుస్తున్నాయి. ఆర్టీసీకి నష్టాలు తెచ్చే ఈ రూట్లు ప్రైవేట్‌కు మాత్రం కాసులు కురిపిస్తున్నాయి. గ్రేటర్‌లోనే ఎక్కవ నష్టాలు వస్తున్నట్లు తేలిపోయింది. హైదరాబాద్ జోన్ పరిధిలోనే రోజూ రూ. 80 లక్షల నుంచి రూ. 1.10 కోట్ల వరకు నష్టాలుంటున్నాయి. కరోనా నేపథ్యంలో కొంతమేరకు తగ్గినా సగటున ఇదే ఉంటోంది. ఆర్టీసీ నివేదికల ప్రకారం మొత్తం నష్టాలలో 75 శాతం గ్రేటర్‌లోనే.
ఆస్తులపై నివేదికలు..
ఆస్తులపై నివేదికలు తయారు చేస్తున్నారు. ఎందుకనేది మాత్రం చెప్పడం లేదు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఆర్టీసీకి దాదాపు రూ. 760 కోట్ల బస్ భవన్‌తో పాటుగా, రాష్ట్రంలో 97 బస్ డిపోలు, 364 బస్టేషన్లు, 14 దవాఖానలు, రెండు జోనల్ వర్క్ షాపులు, ఒక బస్ బిల్డింగ్ యూనిట్, రెండు టైర్ రిట్రీడింగ్ షాపులు, ఒక ప్రింటింగ్ ప్రెస్, ట్రాన్స్‌పోర్టు అకాడమీ ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ. 60 వేల కోట్లు. ఒక్కో డిపో సుమారు 5 నుంచి 10 ఎకరాల విశాల స్థలంలో ఉండగా, బస్ స్టేషన్లు సుమారు రెండు నుంచి నాలుగు ఎకరాలలో ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఎండీ ఆఫీసు, గెస్ట్ హౌజ్ ఉంది. ముషిరాబాద్ పరిధిలోనే ఆర్టీసీకి రూ. 1500 కోట్ల విలువ చేసే భూములున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రెండెకరాలలో ఆర్టీసీ కల్యాణ మండపం, తార్నాకలో కార్పొరేట్ తరహా ఆసుపత్రి, అత్యంత విశాలంగా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, గోషామహల్ డోమ్ ఉన్నాయి.
ఇపుడీ ప్రచారం ఎందుకు?
పొరుగు రాష్ట్రాలలో ఆర్టీసీ పరిస్థితులపై అధ్యయనం చేశారు. మధ్యప్రదేశ్‌లో మూసివేశారని, బెంగాల్ లో నిర్వీర్యం అయ్యిందని, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదతర నాలుగైదు రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదనే ప్రచారం చేస్తున్నారు. కేంద్రమే ఆర్టీసీ అవసరం లేదంటూ చట్టంలో రూపొందించారని అంటున్నారు. ఇప్పుడు ఈ చర్చలు ఎందుకంటూ కార్మికులు ఆందోళనకు గురవుతున్నాయి.