- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పులు ఏటా పెరుగుతున్నాయ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 83,698 కోట్ల అప్పు ఉంటే గతేడాది మార్చి చివరి నాటికి అది రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగినట్లు పీఆర్సీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో తొలి నాళ్లలో 16.03% మేర అప్పు ఉంటే ఇప్పుడు అది 21.39%కి పెరిగిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూలో అప్పులు, వడ్డీల చెల్లింపు కోసమే ఏటా సగటున 12.5% చొప్పున చెల్లిస్తూ ఉందని, గతేడాది మార్చి చివరితో ముగిసిన ఆర్థిక సంవత్సరాన్ని లెక్కలోకి తీసుకుంటే 12.89% చెల్లించినట్లు పేర్కొంది. ప్రతీ ఏటా తీర్చేస్తున్న అప్పులు, ఇంకా తీరకుండా ఉన్న అప్పులపై చెల్లిస్తున్న వడ్డీ కూడా ఆరేళ్ళుగా పెరుగుతూనే ఉన్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,575 కోట్లను వడ్డీల కోసమే చెల్లించిందని పేర్కొంది.
ఏటా పెరుగుతూనే ఉంది
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో ఏటా అప్పు పెరుగుతూనే ఉన్నదని, ఇంకా తీర్చాల్సిన అప్పే 2.03 లక్షల కోట్లు ఉన్నట్లు పీఆర్సీ తన నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం జీఎస్‌డీపీలో 16.03% మాత్రమే ఉందని గుర్తుచేసి రానున్న కాలంలో ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందని వివరించింది. ఐదేళ్లపాటు ఖర్చు గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితులలో రెవెన్యూ, ఖర్చు, అప్పులు తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఏయే రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నామో ఆలోచించి ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు తదితరాలపై ఆచితూచి అడుగేయాలని సూచించింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం గణనీయంగా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.
ఆదాయం వడ్డీలకే సరి
రాష్ట్రాలకు వస్తున్న ఆదాయంలో ప్రతీ రూపాయిలో దాదాపు 13 పైసలను కేవలం పాత, కొత్త అప్పులపై వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందని వివరించింది. రాష్ట్రం దగ్గర నికరంగా ఇప్పుడున్న రూ. 2.03 లక్షల కోట్ల అప్పుల్లో రూ. 1.63 లక్షల కోట్లు వివిధ ద్రవ్య సంస్థల (బహిరంగ మార్కెట్) నుంచి తీసుకున్నదేనని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 9,457 కోట్లు, స్వయం ప్రతిపత్తి (హడ్కో, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ లాంటివి) సంస్థల నుంచి రూ. 12,391 కోట్లు, స్పెషల్ సెక్యూరిటీస్ (స్మాల్ సేవింగ్స్, ప్రొవిడెంట్ ఫండ్ లాంటివి) నుంచి రూ. 18,813 కోట్ల చొప్పున ఉన్నట్లు పీఆర్సీ పేర్కొంది. ఆర్థిక సంఘం సూచించినట్లుగా రాష్ట్ర జీఎస్‌డీపీలో 25% మించి అప్పులు ఉండొద్దన్న నిబంధనలకు లోబడే ఉన్నప్పటికీ రానున్న ఐదేళ్ళ కాలంలో చేరే ఖర్చులతో పోలిస్తే ఆర్థిక నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని పేర్కొనింది.
పాతవి అలాగే ఉన్నాయి
పాత అప్పులను ఏటా క్లియర్ చేస్తూ ఉన్నప్పటికీ ‘స్టాండింగ్ లోన్స్’ మాత్రం ఇంకా గణనీయంగానే ఉన్నాయి. ఏటా దాదాపు కొత్త అప్పులలో మూడొంతుల మేర పాత అప్పుల్ని తీరుస్తూనే ఉంది ప్రభుత్వం. ఉదాహరణకు 2014-15లో కొత్తగా రూ. 9454 కోట్లు అప్పు చేస్తే అప్పటికే ఉన్న అప్పుల్లో రూ. 6954 కోట్లను చెల్లించింది. ఆ తర్వాతి సంవత్సరం (2015-16) రూ. 16,464 కోట్ల కొత్త అప్పులు చేయగా రూ. 9614 కోట్లను తీర్చింది. 2016-17లో రూ. 31,775 కోట్ల మేర కొత్త అప్పులు చేస్తే రూ. 11,067 కోట్ల మేర పాత అప్పుల్ని తీర్చింది. ప్రతీ ఏటా పాత అప్పుల్ని తీరుస్తున్నా అంతకంటే ఎక్కువ కొత్త అప్పులు చేస్తుండడంతో ఇంకా తీర్చాల్సిన అప్పుల భారం పెరుగుతూనే ఉంది. ఈ వివరాలన్నింటిని పరిశీలించిన పీఆర్సీ రానున్న ఐదేళ్ళలో ఉండే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని వ్యాఖ్యానించింది.