ఆ రోడ్డులో ప్రయాణం చేస్తే నరకానికేనట ?

by Sridhar Babu |   ( Updated:2021-10-03 04:38:14.0  )
ఆ రోడ్డులో ప్రయాణం చేస్తే నరకానికేనట ?
X

దిశ, మర్రిగూడ : మండలంలో ప్రధాన రహదారులు మూలమలుపులు, గ్రామీణ ప్రాంతాల రహదారులు గతుకుల మయంగా ఉండడంతో ప్రమాదాలు నిత్య కృత్యం అవుతున్నాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామీణ ప్రాంతాల రహదారులు గతుకుల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.శివన్న గూడెం నుండి తేరటు పల్లి వరకు రహదారి గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మరమ్మతులు చేయించికపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు వెళ్ళటానికి ఇబ్బంది కరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి మరింతగా గుంతలు ఏర్పడడంతో ఫోర్ వీలర్ వెహికల్స్ వాహనదారులకు అక్కడి నుండి ప్రయాణం నరక సంకటంగా మారింది. పలుమార్లు మండల జనరల్ బాడీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని జనరల్ బాడీ నుంచి నిధులు కేటాయించాలని కోరినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.

ఇందుర్తి , మేడి చందాపురం, కొట్టాల, నామా పురం గ్రామాల ప్రజలు రాత్రిపూట ఆస్పత్రికి వెళ్లాలంటే మరి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు . ఈ రహదారి ప్రయాణం‌లో నరకం చూస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే మండలంలో ప్రధాన రహదారులు డబల్ రోడ్డు అయినప్పటికీ మూలమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడ సూచిక బోర్డు లేవు. దీంతో బట్లపల్లి మూలమలుపు వద్ద రాత్రిపూట వాహనదారులు ఎదురెదురు‌గా ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే సరం పేట గ్రామంలోనే ప్రమాదకరంగా మూల మలుపు ఉంది. శివన్న గూడెం, ఎరగాండ్లపల్లి, తిరుగండ్లపల్లి గ్రామాల వద్ద ఉన్న మూలమలుపులు ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు నిత్య కృత్యం అవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రహదారుల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని, ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed