అకాల వ‌ర్షంతో అన్నదాత ఆగమాగం !

by Sridhar Babu |   ( Updated:2020-04-26 04:16:46.0  )
అకాల వ‌ర్షంతో అన్నదాత ఆగమాగం !
X

దిశ‌, ఖ‌మ్మం: మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా మారింది రైతుల ప‌రిస్థితి. క‌రోనా ఎఫెక్ట్‌తో చేతికొచ్చిన పంట‌ను మార్కెట్‌కు త‌ర‌లించి అమ్ముకునే అవ‌కాశం లేక దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న రైతాంగాన్ని అకాల వ‌ర్షం దారుణంగా దొంగ‌దెబ్బ తీసింది. శ‌నివారం సాయంత్రం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభ‌త్సం సృష్టించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఏజెన్సీ మండ‌లాల్లో వ‌డ‌గండ్ల వాన పంట‌ల‌ను నాశ‌నం చేసింది. వ‌రి, మిర‌ప‌, మొక్క‌జొన్న పంట‌ల‌తో పాటు మామిడి, బొప్పాయి, అర‌టి వంటి ఉద్యాన పంట‌ల‌కు భారీగా న‌ష్టం వాటిల్లింది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల‌కు తీసుకువ‌చ్చిన పంట త‌డిసిపోవ‌డంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. వ‌ర్షం ప‌డుతుంద‌ని గ‌త నాలుగు రోజులుగా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తు వ‌స్తూనే ఉంది. అయినా కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులు ప‌ట్టాలు స‌మ‌కూర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని రైతులు మండిప‌డుతున్నారు. త‌డిసిన ధాన్యానికి మ‌ద్ద‌తు ధ‌ర‌తో కొనుగోలు చేయాల‌ని, లేని ప‌క్షంలో ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో పలుచోట్ల వర్షం రావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు తడిసి అన్నదాతలు ఆందోళన చెందారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల, రామచంద్రపురంలో అకాల వ‌ర్షంతో వంద‌లాది ఎక‌రాల్లో వ‌రిపంట దెబ్బ‌తింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త‌డ‌వ‌కుండా కాపాడుకునేందుకు నానాయాత‌న ప‌డ్డారు. అలాగే జూలూరుపాడు మండలంలో ఈదురు గాలులకు వంద‌ల‌ఎకరాల్లో మొక్కజొన్న నేల‌వాలింది. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లిలో భారీగా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండలో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, కాకర్లపల్లి, కల్లూరు, వైరా, కొణిజర్ల మండ‌లాల్లో బ‌ల‌మైన గాలులు వీచాయి. పాల్వంచ మండలం జగన్నాథ‌పురం, నారాయణరావు పేటలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల మ‌ధ్య నుంచి వ‌ర‌ద పారింది. అనేక మండ‌లాల్లో కోత‌కు సిద్ధంగా ఉన్న వ‌రి పంట ధాన్యం నేల‌రాలింది. గాలివాన బీభ‌త్సంతో మామిడి కాయ‌లు నేల‌రాలాయి.

శనివారం సాయంత్రం సంభ‌వించిన వడగళ్ల‌ వర్షానికి ఇళ్ళు, ఆస్తి మొదలైన వాటికి జ‌రిగిన‌ నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేర‌కు ఆదివారం ఉద‌యం నుంచి అధికారులు జిల్లాల్లోని ఆయా మండ‌లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. వేలాది ఎక‌రాల్లో వ‌రిపంటకు స్వ‌ల్పంగా న‌ష్టం జ‌రిగింద‌ని అధికారులు భావిస్తున్నారు. రైతులతో క‌ల‌సి ధాన్యం సేకరణ కేంద్రాలలో వరి, మొక్కజొన్నకు జ‌రిగిన న‌ష్టంతోపాటు తదితర అంశాలపై స‌మాచారం సేక‌రిస్తున్నారు.

tags: Khammam, Bhadradri Kothagudem districts, premature rain, crop loss, collector MV Reddy, horticulture, farmers, pawancha

Advertisement

Next Story