రోజుకు వంద కూపన్లే..

by Shyam |
రోజుకు వంద కూపన్లే..
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా పనులన్నీ వదిలేసి ఇండ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో రోజువారీగా చిన్నా.. చితక పనులు చేసుకుంటూ కుటుంబాలను ఎల్లదీసుకుంటున్న పేదలు ఆకలితో అలమటించకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం‌లోని ఒక్కో సభ్యునికి 12 కిలోల బియ్యం సరఫరాకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

692 కేంద్రాలలో పంపిణీ..

రాష్ట్ర వ్యాప్తంగా గత మూడ్రోజులుగా పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ 674 రేషన్ దుకాణాలకు అదనంగా మరో 18 కేంద్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. జిల్లాలోని 9 సర్కిళ్ల పరిధిలో మొత్తం 5 లక్షల 80 వేల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. పోర్టబిలిటీ ద్వారా కూడా ఇతర జిల్లాల వాళ్లు కూడా రేషన్ ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉన్నందున, బియ్యం తీసుకునే కార్డుదారుల సంఖ్య 6 లక్షలు దాటుతోంది. ఒక్కో రేషన్ దుకాణాలలో సరాసరి 15 వందల నుంచి 2 వేల వరకు కార్డులు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం బియ్యం పంపిణీ మొదలు కావడంతో రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు క్యూ కడుతున్నారు.

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం, రేషన్ దుకాణాల వద్ద ప్రజలకు ముందస్తుగా కూపన్లను జారీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు రోజుకు వంద కూపన్లు మాత్రమే అందజేస్తున్నారు. ముందస్తుగా కూపన్లు పొందిన వారికి మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 6 లక్షల కార్డులకు బియ్యం పంపిణీ చేసేందుకు 20 రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. దీంతో కార్డుదారులు ఈ లోగా బియ్యం మన వరకూ అందిస్తారా అనే సందేహాలతో రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.

సామాజిక దూరానికి చెల్లు..!

రేషన్ దుకాణాల వద్ద బియ్యం పంపిణీకి పేదలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ సమయంలో చాలా కొద్ది దుకాణాల వద్దనే ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. మెజార్టీ దుకాణాల వద్ద కార్డుదారులు ఒకే చోట గుమిగూడి వుంటున్నారు. బియ్యం పంపిణీ కేంద్రాలలో కనీసం పోలీసులను కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వం అనుకుంటున్న లాక్ డౌన్ ఫలితం కూడా నెరవేరే అవకాశం లేకుండా పోతోంది.

Tags: Lockdown , corona effect, rice distribution, civil supply department

Advertisement

Next Story

Most Viewed