‘74 రైళ్లల్లో లక్షకుపైగా వలస కూలీలను తరలించాం’

by Shyam |   ( Updated:2020-05-20 12:12:13.0  )
‘74 రైళ్లల్లో లక్షకుపైగా వలస కూలీలను తరలించాం’
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రం నుంచి వలస కార్మికులను తరలించడంలో సమర్థవంతంగా పని చేసిన అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు. బుధవారం బీఆర్‌కే భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా లక్ష మందికి పైగా తరలించారు. దీంతో పలు శాఖల అధికారులను అభినందించారు. ఆప్ ద్వారా నమోదు చేసి ఎంపిక చేయబడిన వారిని బస్సుల్లో రైల్వే స్టేషన్లకు తరలించి ఆహారం, నీరు అందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన వలస కార్మికుల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వలస కార్మికుల తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు రూ.8.5 కోట్లు చెల్లించిందన్నారు. వలస కార్మికులు వెళ్లవలసిన రాష్ట్రాల నుంచి సమ్మతి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు 74 రైళ్లలో 1,01,146 ప్రయాణికులను తరలించామని సీఎస్ వివరించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed