- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల కళ్లకు ‘పెట్రో’ గంతలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కోరలు చాచడంతో అంతర్జాతీయంగా అన్ని దేశాల మార్కెట్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ ధాటికి అన్ని దేశాల మధ్య చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఫలితంగా చాలా దేశాల్లో చమురు వినియోగం తగ్గిపోయింది. చమురుకు డిమాండ్ క్షీణించి, ధరలు రోజురోజుకూ తగ్గిపోతూ వస్తున్నాయి. గతవారం చమురు ఉత్పత్తి అంశంలో ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) సమావేశంలో సౌదీ, రష్యాల మధ్య గొడవలు మొదలయ్యాయి. చమురుకు డిమాండ్ తగ్గినందున ఉత్పత్తిని కూడా తగ్గించాలనే సౌదీ నిర్ణయాన్ని రష్యా నిరాకరించింది. దీంతో సౌదీ, రష్యా దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు రష్యా ససేమిరా అనడంతో మిగిలిన ఒపెక్ దేశాలు రష్యాను దెబ్బ కొట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశాయి. ఈ పరిణామాలతో చమురు ధరలు 30 శాతం తగ్గిపోయాయి.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదు. కేవలం నెలరోజుల వ్యవధిలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు సుమారు 30 శాతం వరకూ క్షీణించాయి. బ్యారెల్ ధర ఏకంగా 30 డాలర్ల వరకూ తగ్గింది. కానీ, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గట్లేదో చమురు శుద్ధి పరిశ్రమలు, ప్రభుత్వాలు చెప్పాలి.
కరోనా వైరస్ వల్ల చైనాసహా వందకుపైగా దేశాల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.70, డీజిల్ ధర లీటర్‌కు రూ.62గా ఉంది. 2017 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 54 నుంచి 56 డాలర్ల మధ్య ఉండేది. ఆ సమయంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 70, డీజిల్ రూ. 58గా ఉండేది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 30 డాలర్ల వరకూ తగ్గింది. మరి ఇప్పుడు పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 50 నుంచి రూ. 60 మధ్యలో ఉండాలి కదా!? కానీ, దేశీయంగా ఎక్కడా ఈ ధరలు లేవు. అంటే, అంతర్జాతీయంగా చమురు ధరల ఆధారంగా సామాన్యులకు తగ్గిన ధరలతోనే అమ్మాలి. కానీ, అలా జరగడంలేదు.
2019 ప్రారంభంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు పెరిగాయి. అయితే, ఆ సమయంలో పెట్రోల్ లీటర్‌కు రూ. 71, డీజిల్ రూ. 64 గానే ఉంది. అంటే, అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రకారం ఆ సమయంలో దేశీయంగా ధరలు పెంచలేదు. ఇండియాలో చమురు ధరల నియంత్రణ విషయంలో కేంద్రం తన అజమాయిషీని వదులుకున్న తర్వాతే ఈ పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 30 డాలర్ల లోపు ఉంది. ఈ లెక్కన.. పెట్రోల్, డీజిల్ ధరలు కనీసం రూ.10 వరకు తగ్గాలి. కానీ, వాస్తవంలో అలా లేదు. చమురు కంపెనీలు ముక్కి మూలిగి రూ. 2 వరకూ తగ్గించి చేతులు దులుపుకుంటున్నాయి. అంతకుముందు అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెంచలేదు కాబట్టి అప్పటి నష్టాలను భర్తీ చేసుకునేందుకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. గడిచిన దశాబ్దాల నుంచి నష్టాలను తగ్గించుకుంటున్నామని చమురు కంపెనీలు ఢంకా బజాయించడమే కానీ ఆ నష్టాలు ఎన్నాళ్లైనా ఎందుకు తగ్గడం లేదో చెప్పవు. ఆ నష్టాలు తగ్గి ప్రజలకు చమురు భారం తగ్గేదెన్నడో? సమాధానం మాత్రం… చమురులో ముంచిన బీరకాయ అన్నట్లుగా ఉంది. ఇక్కడ మరో వింత వాదన మొదలైంది. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ఒక కారణమనీ, అందుకే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు తగగ్గుముఖం పట్టడంలేదని చెబుతున్నారు. గత రెండేళ్లలో రూపాయి మారకం విలువ రూ.68 నుంచి రూ.73కి పడిపోయిందని, కాబట్టి ఈ లెక్కల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 వరకూ ఎక్కువగా ఉండాలనే వార్తలు వినబడుతున్నాయి.
అసలు పెట్రోల్, డీజీల్ ధరలు ఎందుకు తగ్గవంటే..
ఎక్సైజ్ పన్ను:
ఇండియాలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటానికి ఎక్సైజ్ పన్నులు ముఖ్య కారణం. దక్షిణాసియా మొత్తంలో ఇండియాలోనే ఎక్సైజ్ పన్ను అత్యధికంగా ఉంటుంది. ఎంత అంటే, చమురు ధరల్లో సగం వరకూ ఎక్సైజ్ సుంకం ఉంటుంది. దీనికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలా? చమురు సంస్థలు బాధ్యత వహించాలా? అనేది చాలామందికి తెలీదు. ఎక్సైజ్ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రెట్టింపుస్థాయిలో ఆదాయం వస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.99,000 కోట్లుగా ఉన్న చమురు ఆదాయం 2016-17 నాటికి రూ. 2,42,000 కోట్లకు పెరిగిందంటే వీటి నుంచి ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఆలోచించవచ్చు.
వ్యాట్:
కేంద్రం చురకలకు రాష్ట్ర ప్రభుత్వాల చమక్కులు అదనం. ఇదెలాగంటే, కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకమే సగానికి ఉందంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు వాటి విలువ ఆధారంగా వ్యాట్‌ను వసూలు చేస్తాయి. వీటిని తగ్గించాలని కేంద్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చాలా రాష్ట్రాలు ఈ విజ్ఞప్తులను తుంగలో తొక్కి ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధమైపోతున్నాయి.
డిమాండ్:
పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ డిమాండ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మారుతున్న కాలానికి తగినట్టుగా ప్రజల వద్ద సొంత వాహనాల సంఖ్య పెరుగుతోంది. వాహనాల వినియోగం పెరుగుతుండటం వల్ల చమురు వాడకం కూడా పెరుగుతూ వస్తోంది.
జీఎస్టీ కిందకు చమురు:
అంతర్జాతీయ ధరల ఆధారంగా ప్రజలకు చమురు అందాలంటే చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎప్పటి నుండో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉంది.
కరోనా వైరస్ ధాటికి అంతర్జాతీయంగా సరఫరా దెబ్బ తినడంతో క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా వారం రోజులు తగ్గాయి. 2016 తర్వాత వరుసగా వారం రోజులపాటు చమురు ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు.
Tags: Petrol, Diesel, Petrol & Diesel Prices, Petrol And Diesel Rates, Petrol Price Delhi, Petrol Price Bangalore