బ్యాంకు చోరీయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్​

by Sridhar Babu |   ( Updated:2024-09-21 10:46:48.0  )
బ్యాంకు చోరీయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్​
X

దిశ, ముధోల్ : స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎస్పీఐలో చోరీకి ప్రయత్నించిన ఘటనలో ముధోల్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన శనివారం వివరించారు. ఈనెల 13వ తేదీన ముధోల్ పాత బస్టాండ్ సమీపంలో గల ఎస్బీఐ వెనుక భాగంలో వెంటిలేటర్ కు ఉన్న ఇనుప చువ్వలు తొలగించి ఇద్దరు దొంగలు బ్యాంకులో చొరబడ్డారు. అందులోని సీసీ కెమెరాలు, అలారం వైర్లను కత్తిరించి చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. అదే రోజు గణేష్ నిమజ్జనం ఉండటంతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయినా బ్యాంకులోకి దొంగలు చొరబడటంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. ఎస్ఐ సాయికిరణ్ తన సిబ్బందితో రెండు టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో ఇద్దరు నిందితుల చిత్రాల ఆధారంగా ముధోల్ కు చెందిన షేక్ మోసిన్ అహ్మద్, మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ గా గుర్తించారు. నిందితులను శనివారం ఉదయం అరెస్టు చేశారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి ప్రయత్నించారని సీఐ తెలిపారు. నిందితులకు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా శనివారం సీఐ, ఎస్ఐని ఎస్బీఐ మేనేజర్ ఎస్వీ గిరి సన్మానించారు.

Advertisement

Next Story