లక్సెట్టిపేటలో దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

by GSrikanth |   ( Updated:2022-09-17 14:42:11.0  )
లక్సెట్టిపేటలో దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరిపెట్టి తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి రోడ్డులోని కొత్త ప్లాట్ల కాలనీలో చెన్నాల సాయికిరణ్, ధనలక్ష్మి(23)అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలు సమన్విత(6) శంకరి(6నెలలు)లతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎప్పటిలాగే సాయికిరణ్ ఉదయం కూలీ పనికి వెళ్ళాడు. పనిముగించుకుని సాయంత్రం ఇంటికి రాగా లోపల గడియ వేసి ఉంది. తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి చూశాడు. దూలానికి కట్టిన చీరలకు వేలాడుతూ భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. వెంటనే స్థానికుల సహాయంతో తలుపులను తెరిచాడు. దూలానికి చీరలు బిగించి దానితో పిల్లలకు ఉరి పెట్టి, తాను చీరతో ఉరివేసుకుని ధనలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Advertisement

Next Story