ఇసుక ముసుగులో క‌ల‌ప ర‌వాణా.. సినిమాను తలపించేలా స్మగ్లింగ్

by Javid Pasha |
ఇసుక ముసుగులో క‌ల‌ప ర‌వాణా.. సినిమాను తలపించేలా స్మగ్లింగ్
X

దిశ, ఏటూరునాగారం: ఇసుక లారీ పేరుతో అక్రమంగా క‌ల‌ప‌ను త‌ర‌లిస్తుండ‌గా అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకున్న ఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడు మండ‌లంలో చోటు చేసుకుంది. అట‌వీశాఖ అధికారి (ఎఫ్ఆర్‌వో) చంద్రమౌళి కథనం ప్రకారం.. ఛత్తీస్ ఘ‌డ్ రాష్ట్రం తాళ్లగూడెం నుంచి వాజేడు మండ‌లం టేకుల‌గూడెం గ్రామం మీదుగా ఇసుక లారీలో అడుగు భాగాన క‌ల‌ప‌ను ఉంచి పైనుంచి ఇసుక‌ను నింపి ఎవరికీ అనుమానం క‌ల‌గ‌కుండా అక్రమంగా త‌ర‌లిస్తున్నట్లు విశ్వసనీయ స‌మాచారం మేర‌కు వాజేడు మండ‌లం కృష్ణాపురం రేంజ్​ప‌రిధిలో అట‌వీశాఖ అధికారి ఎఫ్ఆర్‌వో చంద్రమౌళి త‌న బృందంతో వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు.

ఈ క్రమంలో ఛత్తీస్ ఘ‌డ్ రాష్ట్రం నుంచి వ‌స్తున్న ఏపీ 16 టీబీ 5757 నెంబ‌రు గ‌ల ఇసుక‌ లారీని త‌నిఖీ చేయ‌గా ఇసుక ముసుగులో అక్రమంగా త‌ర‌లిస్తున్న సుమారు రూ.10 ల‌క్షల విలువ గ‌ల‌ క‌ల‌పను ప‌ట్టుకున్నట్లు ఎఫ్ఆర్‌వో చంద్రమౌళి తెలిపారు. కాగా అట‌వీశాఖ అధికారుల‌ను గుర్తించిన‌ లారీ డ్రైవ‌ర్ ముందుగానే వాహ‌నాన్ని విడిచి పారిపోయిన‌ట్లు ఎఫ్ఆర్‌వో తెలిపారు. ప‌ట్టుకున్న క‌ల‌ప‌, లారీని వెంక‌టాపురం రేంజ్​డివిజ‌న్ ఆఫీస్ కు త‌ర‌లించిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు తెలిపారు.

ఆరా తీస్తున్న అధికారులు..

ఇసుక ముసుగులో క‌ల‌ప‌ను త‌ర‌లిస్తున్న లారీను ప‌ట్టుకున్న అట‌వీశాఖ అధికారులు ఇసుక లారీ ఇంట‌ర్ స్టేట్ లారీగా గుర్తించారు. కాగా ప‌ట్టుకున్న ఇసుక లారీ ఏ ఇసుక క్వారీ నుంచి వ‌స్తుంది..? గ‌తంలో ఇదే త‌ర‌హాలో అక్రమంగా క‌ల‌ప ర‌వాణా కొన‌సాగించారా..? ప్రస్తుతం పట్టుకున్న ఇసుక లారీ ఏ క్వారీకి ఇసుక కోసం బుకింగ్ చేసుకున్నారు అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లుగా స‌మాచారం. కాగా ప‌ట్టుకున్న ఇసుక లారీ ఏపీ 16టీబీ 5757 అనే నెంబ‌ర్ ఆన్‌లైన్ సైట్ ఎస్ఎస్ఎంఎస్​(సాండ్ సేల్ మానేజ్‌మేంట్ అండ్ మానిట‌రింగ్ సీస్టమ్)లో బుక్ అయి ఉండ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story