నలుగురు సంఘ విద్రోహులు అరెస్ట్​

by Sridhar Babu |
నలుగురు సంఘ విద్రోహులు అరెస్ట్​
X

దిశ, ఆదిలాబాద్ : నలుగురు సంఘ విద్రోహులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటు కోసం నిందితులు ఆర్థికంగా, ఆయుధపరంగా దళం పునర్నిర్మాణం చేస్తుండగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు. వీరిలో వెంకటరెడ్డి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి అరెస్టు అయినట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తన మిత్రుడి హత్య కేసుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించడంతో పాటు జనశక్తి పార్టీని తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థాపించాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ఈయనకి నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థిక సహాయం చేశారన్నారు. దాంతో తన అనుచరులు హేమ కాంత్ రెడ్డి తో పాటు మరో వ్యక్తితో కలిసి కాశీలో మకాం వేశారు. వీరు బీహార్ రాష్ట్రం మృంగార్ రైల్వే స్టేషన్ కు వెళ్లి పిస్టల్స్, బుల్లెట్లను సేకరించి తిరిగి కాశీకి వెళ్లేక్రమంలో ఆదిలాబాద్ జిల్లా చాంద టి బైపాస్ రోడ్డు వద్ద ఉన్నారని చెప్పారు. దీంతో పక్కా సమాచారంతో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై ముజాహిద్, సిబ్బంది కలిసి తనిఖీ చేపట్టగా వారి వద్ద పిస్టల్స్, 8 మ్యాగజైన్లు, 18 రౌండ్ల బెల్లెట్లను, వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

వీరితో మరికొందరికి సంబంధం ఉందని, వారికోసం ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు పంపడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు,డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐలు కె.ఫణిదర్, కరుణాకర్, డి.సాయినాథ్, ఎస్సైలు ముజాహిద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed