జువెల్లరీ దుకాణాలు క్లోజ్.. భారీగా ఆభరణాలు సీజ్!

by GSrikanth |
జువెల్లరీ దుకాణాలు క్లోజ్.. భారీగా ఆభరణాలు సీజ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగారం విక్రయాల్లో అక్రమాలు, మనీ లాండరింగ్ లాంటి ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై రెండు రోజుల పాటు జువెల్లరీ దుకాణాలపై సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ ఎత్తున ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముసద్దీలాల్, ఎంబీఎస్ జువెల్లరీ దుకాణాలను క్లోజ్ చేశారు. సుమారురూ. 100 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 50 కోట్ల విలువైన వజ్రాభరణాలను సీజ్ చేసి కోఠిలోని భారతీయ స్టేట్ బ్యాంకు ట్రెజరీకి తరలించారు. డాక్యుమెంట్లను, సేల్స్ రిజిస్టర్లను, కంప్యూటర్ హార్డ్ డిస్కులను ఈడీ ఆఫీసుకు తరలించారు. ఈ రెండు దుకాణాలకు చెందిన నిర్వాహకులపై మనీ లాండరింగ్, 'ఫెమా' చట్టం కింద కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు జరిగిన సోదాలు పూర్తయ్యాయి. ఏక కాలంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల్లో సోమ, మంగళవారం దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

ముసద్దీలాల్ జువెల్లర్స్ వ్యాపారంపైన గతంలోనూ ఐటీ, సీబీఐ, ఈడీ విభాగాలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. నోట్ల రద్దు సమయంలో పాత నోట్లను కొత్త వాటిలోకి మార్చుకోడానికి బోగస్ విక్రయాలను చేపట్టిందని, సుమారు రూ. 110 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఈడీ గతంలో కేసు పెట్టింది. ఆ తర్వాత జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు కూడా కేసులు నమోదయ్యాయి. గతేడాది సైతం బంగారం విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్న కారణంగా దర్యాప్తు జరిపి రూ. 321 కోట్ల మేర ఆస్తులను ఈడీ జప్తుచేసింది. తాజాగా మళ్ళీ ఆరోపణలు రావడంతో రెండు రోజుల పాటు కంటిన్యూగా సోదాలు చేసి కిలోలకొద్దీ బంగారు ఆభరణాలను సీజ్ చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నది.

నగరంలోని ఎర్రమంజిల్‌తో పాటు సికింద్రాబాద్ షోరూమ్‌లో, విజయవాడ నగరంలోనూ సోదాలు చేసింది. విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఎంబీఎస్ జువెల్లర్స్ దుకాణంలోనూ ఇదే ఆరోపణలపై సోదాలు చేసిన ఈడీ బృందాలు డైరెక్టర్లయిన సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తాలకు బినీమా పేర్లతో ఉన్న సుమారు రూ. 50 కోట్ల ఆస్తుల్ని కూడా సీజ్ చేశాయి. ఎంబీఎస్ జువెల్లర్స్ తో పాటు అనుబంధ సంస్థలు మెటల్ అండ్ మినెరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 500 కోట్ల విలువైన బంగారాన్ని కొని విక్రయించినా ఆ డబ్బుల్ని చెల్లించకుండా ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీర్ఘకాలంగా పేమెంట్ చేయకపోవడంతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పద్ధతిలో పరిష్కరించుకోడానికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ సీబీఐకి కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది.

దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ అదికారులకు జువెల్లర్స్ లోని నిర్వాహకులే కార్పొరేషన్‌లోని కొద్దిమందికి సహకారం అందిస్తున్నట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానం రావడంతో ఈడీ రంగంలోకి దిగి కేసును టేకప్ చేసింది. అందులో భాగమే రెండు రోజుల సోదాలు, ఆభరణాల సీజ్, దుకాణాల క్లోజ్.

Advertisement

Next Story

Most Viewed