ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు

by Shiva |
ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు
X

నిందితుల నుంచి రూ.93 వేల నగదు స్వాధీనం

దిశ, కరీంనగర్ టౌన్ : నిరుద్యోగులైన అమాయక యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి, రూ.లక్షలు దండుకుంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్, పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన గంగారపు మధుమూర్తి, చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం, మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తూన్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరి వల్ల నష్టపోయిన బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా ఉంచి మంగళవారం అదుపులోకి తీసుకొన్నారు. నిందితులను విచారించగా తమ నేరాన్ని అంగీకరించడంతో పాటు గత కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలిపారు. నిందితుల నుంచి రూ.93 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరిట ఎంతమంది వద్ద డబ్బు వసూలు చేసారనే విషయంపై విచారణ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Advertisement

Next Story