మహిళా జర్నలిస్టుపై ఊబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

by Javid Pasha |   ( Updated:2023-03-03 10:36:40.0  )
మహిళా జర్నలిస్టుపై ఊబర్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన ఊబర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని భరత్ నగర్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ ఈ నెల ఒకటో తేదీన ఎన్ఎఫ్సీ నుంచి మాళవీయ నగర్ లోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లడానికి ఊబర్ ఆటో బుక్ చేసుకుంది. ఆటో రాగానే అందులోకి ఎక్కి కూర్చుంది. వెంటనే హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వినడం మొదలు పెట్టింది. ఆటో స్టార్ట్ చేసిన డ్రైవర్ ఆటోకు ఎడమ వైపు ఉన్న అద్దంలో ఆమె వైపు అదోలా చూడటం మొదలుపెట్టాడు. అయితే అది గమనించిన సదరు మహిళ చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.

వెంటనే మధ్యలో నుంచి కుడి వైపుకు జరిగి కూర్చుంది. దీంతో ఆ డ్రైవర్ ఆమెను కుడి వైపు ఉన్న మిర్రర్ లో నుంచి మళ్లీ అలాగే చూడటం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పూర్తిగా ఎడమవైపుకు జరిగి కూర్చుంది. దీంతో ఆ డ్రైవర్ అమాంతం వెనక్కి తిరిగి తననే చూడటం మొదలు పెట్టాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఆగ్రహానికి గురైన ఆ మహిళా జర్నలిస్టు పోలీసులకు కంప్లైంట్ చేస్తానని అతడికి వార్నింగ్ ఇచ్చింది. అయినా అతడు వినకపోవడంతో ఊబర్ యాప్ ఓపెన్ చేసి అందులోని హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ టెక్నికల్ కారణాల వల్ల కాల్ కనెక్ట్ కాలేదు. మొత్తానికి ఆ కీచకుడి భారీ నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె.. అనంతరం ఈ ఘటనపై ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.

ఆమె ట్వీట్ వైరల్ కాగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఘటనపై విచారణ జరిపి సదరు డ్రైవర్, అలాగే ఊబర్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 509 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆటో ఓనర్ మహ్మద్ యూనస్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనపై బాధిత మహిళా జర్నలిస్ట్ మాట్లాడుతూ.. పట్టపగలే ఇలా జరిగితే ఇక రాత్రి వేళల్లో ఏమై ఉండేదో ఊహించుకోవాలని అన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఊబర్ యాప్ లోని ఫోన్ నెంబర్ పని చేయలేదని ఆరోపించింది.

Advertisement

Next Story