విద్యుత్‌ అమరవీరుల స్ఫూర్తితో మరో పోరాటం

by Shyam |   ( Updated:2021-08-28 06:57:29.0  )
CPM leader Vidyasagar Rao
X

దిశ, ఆందోల్: బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల సాక్షిగా.. విద్యుత్ బిల్లు వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) నేత విద్యాసాగర్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అనే ముగ్గురు ఉద్యోగులను పొట్టనపెట్టుకున్నదని, వారి పోరాట ఫలితమే నేటికీ ఉచిత విద్యుత్ అమలు అవుతోందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక, అప్రజాస్వామికంగా విద్యుత్ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంటోందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఖండించారు. తక్షణమే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ దూరం చేసి, పెట్టుబడిదారుల మెప్పు పొందడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని విమర్శించారు. నాటి విద్యుత్ ఉద్యమంలో అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసంత్ కుమార్, సురేష్, సంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story