ఆకలితో అలమటిస్తుంటే ఎందుకు పంపిణీ చేయలేదు.. జూలకంటి ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-09-18 08:48:03.0  )
CPM leader Julakanti Rangareddy
X

దిశ, నేరేడుచర్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు, మేధావులు, కవులను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దారుణమని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 60 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నదని కేంద్రమే ప్రకటించిందని, కరోనా సమయంలో అనేకమంది పేదలు ఆకలితో అలమటిస్తుంటే ఆ ధాన్యాన్ని ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని గత తొమ్మిది నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

రోజురోజుకూ నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతూ పేదలపై పెనుభారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ ప్రవేశ పెట్టిందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని 19 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నాయని, 27న భారత్ బంద్ పిలుపునిచ్చారని, అందరూ కలిసి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్, ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, పురుషోత్తంరెడ్డి, విజయ్, జనార్దన్ రెడ్డి, అమరారెడ్డి, నందయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story