ఇస్రోలో ప్రైవేట్ భాగస్వామ్యం ఆత్మహత్య సదృశ్యమే : సీపీఐ

by Shamantha N |
ఇస్రోలో ప్రైవేట్ భాగస్వామ్యం ఆత్మహత్య సదృశ్యమే : సీపీఐ
X

దిశ, న్యూస్ బ్యూరో: భారత అంతరిక్ష కార్యకలాపాలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఆత్మహత్య సదృశ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఇస్రోకు నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు. దేశ భద్రతలో అంతరిక్షం చాల కీలకమైన భాగమనీ పొరుగు దేశాల నుంచి ముప్పు ఎదురవుతున్న సమయంలో అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు వ్యక్తులను అనుమతించడం దేశానికి ముప్పు వాటిల్లుతోందని హెచ్చరించారు.

ఇస్రోని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం 2017నుంచి ప్రయత్నిస్తోందన్నారు. 2018లో ఇస్రో చైర్మన్ ప్రైవేటురంగం భాగస్వామ్యం మాత్రమేనని, ప్రైవేటీకరణ ఉండదని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు స్వతంత్ర డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.ఇస్రోకు అత్యంత లాభదాయకమైన వ్యాపారం వాణిజ్య ఉపగ్రహాలు, ఇప్పుడు అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని వివరించారు.

ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయానికి ఇస్రో చైర్మన్ వంతపాడటం, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా వ్యవహారించడం అత్యంత విచారకరమన్నారు.భాతరదేశం అంతరిక్ష కార్యకలాపాల్లో ఇస్రో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని, అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థగా అవతరించిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు రూ.లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇవ్వగలదు, కానీ ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లకు నిధులు ఇవ్వలేమని చెబుతోందని పేర్కొన్నారు. ఇస్రో ఉపగ్రహాలను చౌకగా పంపుతుందని, మన కమ్యూనికేషన్ వ్యయం తక్కువ కావడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రైవేటీకరణలో దేశ భద్రతతో రాజీపడడంతో పాటు ఇవన్నీ నిలిచిపోతాయని చెప్పారు. అందువల్ల అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించాలన్న కఠినమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed