15 శాతం కొవిడ్ మరణాలకు కారణం ఇదే!

by Anukaran |   ( Updated:2020-11-02 07:08:27.0  )
15 శాతం కొవిడ్ మరణాలకు కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మరణాలు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ ఎక్కువ శాతం మరణాలకు గాలి కాలుష్యమే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. కలుషిత గాలిని ఎక్కువ కాలం పీల్చిన కారణంగా కొవిడ్ 19 సోకగానే ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమై మరణానికి దారితీస్తోందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల్లో సంభవించిన మరణాల్లో 27 శాతం మరణాలు గాలి కాలుష్యం కారణంగానే సంభవించాయని నిర్ధారించబడింది. యూరప్‌లో 19 శాతం, ఉత్తర అమెరికాలో 17 శాతం మరణాలు గాలి కాలుష్యం వల్లనే అని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక కార్డియోవస్కులర్ రీసెర్చ్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది.

కలుషిత గాలిని పీల్చినపుడు అది నేరుగా ఊపిరితిత్తులను, రక్తనాళాలను ప్రభావితం చేసి తీవ్రమైన ఆక్సిడేటివ్ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల వాయుగోణుల లోపల పలుచని పొర దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్నవారికి కొవిడ్ 19 సోకితే వాయుగోణులు పూర్తిగా పనిచేయకుండా పోతాయని అధ్యయనం చేసిన థామస్ ముంజెల్ తెలిపారు. అయితే వీరి అధ్యయనం కోసం మధ్యస్థ, ఉన్నత స్థాయి దేశాల్లోని డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. వీటితో పోల్చి చూస్తే తక్కువ స్థాయి దేశాల్లో గాలి కాలుష్య ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చని థామస్ అంచనా వేశారు. భవిష్యత్ కాలంలో ఇలా గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ల సంఖ్య పెరిగితే మరణాల రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే వీలైనంత వరకు కాలుష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని థామస్ సూచించారు.

Advertisement

Next Story