ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్!

by Shamantha N |
ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్!
X

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ‘కోవాక్సిన్’‌ను స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)లోపు ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంచలన ప్రకటన చేసింది. ఇందుకోసం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్) సంస్థతో కలిసి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దీనికిగాను 12 ఇన్‌స్టిట్యూట్‌లను గుర్తించింది. ఇందులో హైదరాబాద్ నుంచి నిమ్స్ స్థానాన్ని దక్కించుకుంది. నిమ్స్‌లోనూ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుగా దీన్ని భావిస్తున్నది. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(పూణె)లో ఐసొలేట్ చేసిన సార్స్ కొవిడ్-2 కణాల సహాయంగా ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఈ వ్యాక్సిన్‌ ప్రి క్లినికల్, క్లినికల్ డెవలప్‌మెంట్ కోసం బీబీఐఎల్‌తో కలిసి ఐసీఎంఆర్ పనిచేస్తున్నదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి అన్ని సంస్థలు పాటుపడాలని సూచించారు. అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. కోవాక్సిన్ ట్రయల్స్ రెండు దశలుగా సాగనున్నాయి. అనంతరం మూడో దశలో వాలంటీర్లపై ట్రయల్స్ జరుగుతాయి. సబ్జెక్ట్ ఎన్‌రోల్‌మెంట్ గడువు జూన్ 7ను దాటొద్దని ఐసీఎంఆర్ సూచించింది. కాగా, ఆగస్టు 15లోపు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడంపై వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేశారు. ఇంకా ప్రి క్లినికల్ దశలోనే ఉన్న ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అన్ని విజయవంతం చేసుకుని అందుబాటులోకి రావడానికి ఎక్కువ రోజులే పట్టవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed