కూతురు ప్రేమ వివాహం.. ఆమె స్థానంలో మేకకు సీమంతం

by Anukaran |
confined to a goat
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్న బిడ్డలను తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు వారికి దూరమైతే ఎంత బాధపడుతారో వర్ణించలేం. వారి ఆలోచనతోనే మానసికంగా కృంగిపోతారు. ఆ మానసిక వేధన నుంచి బయట పడటానికి వారి దృష్టి మళ్లించే పనులు చేయాలి. అయితే కర్ణాటకకు చెందిన ఓ జంట తన బిడ్డ జ్ఞాపకార్థంగా ఓ మేకను సాదుకున్నారు. అంతటితో ఆగక దానికి సీమంతం చేసి వార్తల్లోకెక్కారు.

కర్ణాటక రాష్ట్రం, చిత్రదుర్గ జిల్లా నన్నివాల గ్రామానికి చెందిన రాజు, గీత దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రంజిత తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమార్తె తమ మాట కాదని పెళ్లి చేసుకోని వెళ్లిపోవడంతో ఆ దంపతులు మానసిక వేధనకు గురయ్యారు. అనుక్షణం రంజితే గుర్తుకు వస్తుండడంతో ఆమె స్థానంలో వారు ఒక జింకను పెంచుకున్నారు. అయితే జింకను పెంచుకోవడం చట్టవిరుద్ధం కావడంతో వారు దానిని అడవిలో వదిలి పెట్టారు. ఆ తర్వాత ఓ మేకను తెచ్చుకున్నారు. దానిని కన్న కూతురిని ఎంతో ప్రేమగా, అల్లారు ముద్దుగా చూసుకున్నారో అంతే గారభంగా చూసుకున్నారు. ఇటీవల అది గర్భం దాల్చడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

A couple confined to a goat

రాజు, గీత దంపతులు ఆ మేకకు సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు. తన బిడ్డే గర్భం దాల్చితే ఎలా ఫంక్షన్ చేయాలో అలాగే చేయాలని శుభకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేక సీమంతానికి ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధు, మిత్రులను ఆహ్వానించారు. పండ్లు, ఫలహారాలు, నూతన వస్త్రాలతో మేకకు ఘనంగా సీమంతం చేశారు. ఖర్చుకు వెనకాడకుండా వైభవంగా శుభకార్యాన్ని చేశారు. బంధు, మిత్రులు సైతం వారి వేడుకను చూసి ముగ్ధులయ్యారు. బిడ్డ మీద ప్రేమను ఆ తల్లిదండ్రులు మూగ జీవిపై చూపించడాన్ని అందరూ కొనియాడారు. ప్రస్తుతం మేక సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story