మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

by Sridhar Babu |   ( Updated:2021-11-01 00:53:51.0  )
Counting-in-Huzurabad1
X

దిశ, హుజురాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. గతానికి భిన్నంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్ మనోగతం అంతు చిక్కడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో చర్చినీయాంశంగా మారిన ఖరీదైన విజేత ఎవరన్నది మంగళవారం ఓట్ల లెక్కింపుతో స్పష్టత రానున్నది. సీఎం కేసీఆర్ ఈటలను మంత్రి మండలి నుంచి తొలగించడం, ఆత్మాభిమానం పేరిట ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయింది. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య జరిగిన ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన పార్టీల బడా నేతలంతా హుజురాబాద్ నియోజకవర్గంలోనే మకాం వేసి 5 నెలలపాటు వ్యూహ ప్రతి వ్యూహాలతో అహో రాత్రులు శ్రమించి ప్రచారాన్ని హోరేత్తించారు. టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారానికి ధీటుగా ఈటల దంపతులు తమదైన శైలిలో ఎదుర్కొన్నారు. ద్వితీయ శ్రేణి క్యాడర్ టీఆర్ఎస్ వెంట ఉండగా కింది స్థాయి బీజేపీ కార్యకర్తలు ఈటలకు ఆశించిన స్థాయిలో సహకరించలేదనే ప్రచారం సాగింది. అయినప్పటికీ తన అభిమానులనే నమ్ముకున్న ఈటల పాద యాత్ర, ప్రచారాన్ని నిర్వహించి పట్టు సడలకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి అడ్డా హుజురాబాద్ కు మార్చి క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపి ఈటల గ్రాఫ్ కొంత మేరకు తగ్గించగలిగారు. ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగింపు దశలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, సినిమా నటులు విజయశాంతి, బాబు మోహన్ తదితర నేతలు ఈటలకు కొండంత అండగా నిలిచారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ ఎన్నికల ఇన్ చార్జిగా వ్యవహరించగా, మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభా, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ఈటల వెంట నడిచారు.

అయితే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, సుంకే రవి శంకర్, నన్నపనేని నరేందర్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అన్ని తామై వ్యవహరించారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సరళిని చూసి గెలుపోటములపై ఇరు పార్టీల నేతలకు స్పష్టత రాక తర్జన భర్జన పడుతున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండటంతో కార్యకర్తల్లో మరింత ఉత్కంఠకు కారణమవుతోంది. ఏదేమైనా హుజురాబాద్ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగానే భావించాల్సి ఉంటుంది.

22 రౌండ్లలో లెక్కింపు

బైపోల్ కౌంటింగ్ కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలతో రెండు హాళ్లలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఒక్క హాల్ లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎంలను లెక్కించనున్నారు. 22 రౌండ్లలో పూర్తి కానున్న లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ చేయనున్నారు.

ఆ ధీమాతో సైలెంట్‌గా టీఆర్ఎస్.. ఫుల్ జోష్‌లో బీజేపీ

Advertisement

Next Story