కరోనా భయానికి కదలని సరుకులు!

by Shyam |
కరోనా భయానికి కదలని సరుకులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమై రెండు వారాలు గడిచింది. చిన్నా చితక వ్యాపారులు ఖాళీగా ఉన్నారు. గత వారం రోజులుగా చాలామంది వినియోగదారులు భయాందోళనల మధ్య బతుకు లాగిస్తున్నప్పటికీ వ్యాపారస్తులు సరుకులు తమ వద్దకు కూడా రావట్లేదని వాపోతున్నారు. అమ్మకాల్లో జరుగుతాయనే నమ్మకం కూడా పోయిందని రాబోయే కొద్ది వారాల పాటు దుకాణాలను మూసేయాలనే ఆలోచనలున్నట్టు కొందరు దుకాణాదారులు చెబుతున్నారు.

మరికొందరు దుకాణాదారులు మాత్రం నేరుగా పంపిణీదారుల నుంచి సరుకులను కొంటూ నష్టాలను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నారు. పంపిణీదారుల వద్ద సరుకులను డెలివరీ చేసే వారు లేకపోవడం వల్ల దుకాణాదారులే సొంతంగా వెళ్లి సరుకులను తెచ్చుకుంటున్నారు.

అవసరమైన వస్తువుల సరఫరా ఆగదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ రవాణా అతిపెద్ద సవాలుగా మారిందని సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మానవ వనరులతో పంపిణీ కార్యకలాపాలు నిరంతరాయనంగా కొనసాగడానికి రాష్ట్ర అధికారులతోనూ, స్థానిక పరిపాలనాధికారులతోనూ కలిసి పనిచేస్తున్నామని వ్యాపారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అధికారుల నుంచి అనుమతులు లభించినప్పటికీ, వాహనాల లభ్యత మరో సమస్యగా మారింది. అంతర్రాష్ట్ర కర్మాగారాల్లో మానవ వనరులు కొరత స్థానిక రవాణాకు తీవ్ర ఆటంకంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. చాలామంది పనిచేసే వారు కరోనా భయం కారణంగా ఇంటికి వెళ్లిపోయారు. ఇది మరిన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో వ్యాపారానికి గడ్డుకాలం రాబోతుందనే ఆందోళన మాకు ఎక్కువైందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, కొన్ని పెద్ద కంపెనీలకు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. దోశ, ఇడ్లీ పిండి, పనీర్, ఫిల్టర్ కాఫీ వంటి ఉత్పత్తులను అమ్మే ఓ కంపెనీ గతంలో 45 నగరాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేసేది. ప్రస్తుతం కరోనా భయంతో ఉద్యోగులు లేక, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల పంపిణీ చేయలేకపోతున్నామని సదరు కంపెనీ వ్యవస్థాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికే సరిహద్దులను మూసివేశారు. మంగళూరు వంటి నగరాల్లో ప్రవేశించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేలో ట్రక్కులకు అనుమతిని నిరాకరిస్తున్నారు’ అని సదరు సంస్థ వ్యవస్థాపకుడు వివరించారు.

కొందరు కంపెనీ యజమానులు తమ కార్మికులతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వారిని తిరిగి పనిలోకి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. వారికి అవసరమైన ఆహారం, బస ఏర్పాట్లు అందించడానికి కూడా సిద్ధమయ్యాయి. పంపిణీ కోసం బయటకు వెళ్లడానికి అవసరమైన పాస్‌లు అధికారుల అనుమతులతో ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. మరిన్ని సౌకర్యాలతో కార్మికులను పనిలో తిరిగి రప్పించే అన్ని రకాల ప్రయత్నాలతో యజమానులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి చాలామంది చిన్న, మధ్య తరహా తయారీదారులకు ఎదురైన అతిపెద్ద సమస్య..ఏది అవసరమైన వస్తువుల జాబితాలోకి వస్తాయనే స్పష్టత లేకపోవడం. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, అన్ని విషయాల పట్ల క్రమబద్దీకరణ చేపట్టడానికి సమయం పడుతుందని కొందరు వ్యాపారులు తెలిపారు.

పంపిణీకి మానవవనరుల కొరత కారణంగా డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరికొన్ని కంపెనీలతో భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. వీలైనంత తొందరగా పరిస్థితులను మెరుగుపరిచి ప్రజలకు అవసరాన్ని, వ్యాపారులకు నష్టాన్ని తగ్గించే ప్రయత్నం ప్రభుత్వాలు చేపట్టాలని కంపెనీ యజమానులు కోరుతున్నారు.

Tags: Coronavirus India, Coronavirus In India, Coronavirus News, Coronavirus India Lockdown, Coronavirus Symptoms | Coronavirus Cas

Advertisement

Next Story

Most Viewed