కరోనాపై విస్తృత ప్రచారం

by Shyam |   ( Updated:2020-03-21 01:47:01.0  )
కరోనాపై విస్తృత ప్రచారం
X

దిశ, మహబూబ్‌నగర్:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కోవిడ్-19) మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశానుసారం మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విస్తృత చర్యలు చేపడుతోంది. ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

గ్రామాల్లో ఇంటింటి సర్వే..

జిల్లా వైద్య సిబ్బందితో పాటు ఇతర శాఖల వారినీ అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా అధికారులు అదేశాలు జారీ చేశారు. దాంతో రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింటి సర్వే చేస్తు దూర ప్రాంతాలు, విదేశాల నుంచి ఎవరైన వచ్చి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా వచ్చే వారి గుర్తించాలని అందుకు అప్రమత్తంగా ఉండాలని గ్రామాధికారులను అదేశించారు. జిల్లాకు ఇప్పటి వరకు విదేశాల నుంచి మొత్తం సుమారు 126మంది వచ్చినట్టు గుర్తించామనీ, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ క్వారెంటైన్ సెంటర్లకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు తమవంతు బాధ్యతగా వ్యవహరించి విదేశాల నుంచి వచ్చినట్లు, వైరస్ సోకినట్లు అనుమానం వచ్చినా కూడా వెంటనే హెల్ప్ లైన్ సెంటర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్..

ప్రజల సౌకర్యార్థం అన్ని జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ 08542-241165, నారాయణపేట -08506-282888, నాగర్ కర్నూల్ 957300104, వనపర్తి 7288064701, జోగుళాంబ గద్వాల జిల్లా 8008553810, 08546-274002లను ప్రజలు సంప్రదించాలని సూచించారు. శుక్రవారం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు ఉమామహేశ్వర స్వామి ఆలయం, మన్యంకొండ, జోగుళాంబ గద్వాల, కొల్లాపూర్ ఆలయాలతో పాటు శ్రీరాంగాపూర్ ఆలయాల మూసి ఉంచారు. ఈ నెల 22వ తేదిన కూడా ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధంలో ఉండాలనీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు.

Tags: corona(covid-19), effect, alert, administration dept

Advertisement

Next Story

Most Viewed