ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సలు

by Shyam |
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పేషెంట్ల చికిత్స, అనుమానితులకు నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి ప్రైవేటు ఆస్పత్రులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. చికిత్స చేసే ఆస్పత్రులూ, నిర్ధారణ పరీక్ష చేసే లేబొరేటరీలకు విధిగా ఐసీఎంఆర్ గుర్తింపు ఉండాలని, ఇప్పటికే గుర్తింపు పొందినవాటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సూచించింది. కరోనా కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన గాంధీ ఆస్పత్రి, నిమ్స్ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం షరతులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇలాంటి సౌకర్యాన్ని పొందే వెసులుబాటు ఉండాలని, అది ప్రజల హక్కు అని జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణన్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది.

కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ గంటా జయకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం సూచించిన ఆస్పత్రులు లేదా లేబొరేటరీలో మాత్రమే సేవలు పొందాలని ప్రభుత్వం నిర్బంధ నిర్ణయం తీసుకోజాలదని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం కరోనా చికిత్స అందించడానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు ఉన్నట్లయితే, ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్లయితే అక్కడ కూడా ప్రజలు ఈ సేవలను డబ్బులు చెల్లించి పొందవచ్చని స్పష్టం చేసింది. ప్రజలు కోరుకున్న చోట ఇలాంటి సౌకర్యాలు పొందే హక్కు ఉన్నదని స్పష్టం చేసింది. తగిన మౌలిక సౌకర్యాలు ఉండి ఐసీఎంఆర్ అనుమతి పొందలేని ఆసుపత్రులు, లేబొరేటరీలు నిర్దిష్ట విధానంలో ఆ సంస్థను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చునని హైకోర్టు సూచించింది. అయితే అనుమతి మంజూరు చేసే ముందు ఐసీఎంఆర్ సైతం తగినంత మంది డాక్టర్లు, నర్సులు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేవో వీలైనంత తొందరలో పరిశీలించాలని పేర్కొంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి, మృతి చెందే అవకాశాలు ఉన్నందునే వీలైనంత తొందరగా అని వ్యాఖ్యానించాల్సి వస్తోందని బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఇలా చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష చేసే లేబొరేటరీలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని పేర్కొంది. ఇలాంటి ప్రజా సంబంధమైన పిటిషన్‌ దాఖలు చేసినందుకు పిటిషనర్‌ను బెంచ్ అభినందించింది.

Advertisement

Next Story

Most Viewed