- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఎంత?
దిశ, న్యూస్ బ్యూరో: మూడు విడతలుగా లాక్‌డౌన్ విధించినా దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు మాత్రం పుట్టుకొస్తూనే ఉండడాన్ని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సీరియస్‌గా తీసుకుంది. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తికి ఎక్కడి నుంచి వైరస్ సోకిందో స్పష్టత లేదు. ఒకరి నుంచి మరొకరికి ఏయే మార్గాల ద్వారా సోకుతుందో, లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్ ఎందుకు నిర్ధారణ అవుతుందో అంతుబట్టకపోవడంతో ఐసీఎంఆర్ (ఇండిన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి), ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా అరవై జిల్లాల్లో రాండమ్ పరీక్షలు నిర్వహించాలని భావించింది. ఇందుకోసం తెలంగాణలో కామారెడ్డి, నల్లగొండ, జనగాం జిల్లాలను ఎంపిక చేసింది. ఈ రెండు సంస్థల బృందాలు శుక్రవారం నుంచే నమూనాలను సేకరిస్తున్నాయి. ఒక్కో జిల్లాలో పది గ్రామాలను ఎంచుకుని, ఆ గ్రామంలో 40 మందికి రక్త పరీక్షలు చేయాలని ప్రోటోకాల్ రూపొందించింది. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ కోసం గొంతు, ముక్కులోంచి నమూనాలు సేకరించే విధానానికి బదులుగా తొలిసారి రక్తంలోని సీరమ్ ద్వారా కరోనా లక్షణాలను తేల్చే నూతన ప్రక్రియకకు ఈ సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఇందుకోసం పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రత్యేకంగా ఒక కిట్‌ను రూపొందించింది. ఆ ప్రకారమే రక్త నమూనాలను సేకరిస్తున్నాయి ఈ బృందాలు.
కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ పరిస్థితిని నిర్ధారిస్తాం : డాక్టర్ హేమలత
ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ బృందాలు ఈ గ్రామాల్లో ‘సీరో-సర్వియలెన్స్’ పేరుతో కరోనా ఇన్‌ఫెక్షన్ ఏ స్థాయిలో ఉంది, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ చోటుచేసుకుందా, లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ ఎందుకొస్తోంది, వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది, పాజిటివ్ ఉన్నవారిలో యాంటీ బాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి.. ఇలా అనేక విషయాలు ఈ సర్వే ద్వారా స్పష్టమవుతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత వివరించారు. ప్రతీ గ్రామంలో నలభై మంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తామని, ప్రతీ జిల్లాలో పది గ్రామాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని, నెల రోజుల వ్యవధిలో అదే గ్రామంలో నాలుగు రౌండ్ల సర్వే జరుగుతుందని వివరించారు. ఇందుకోసం 18 ఏళ్ళ వయసు పైబడినవారిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. రక్తంలోని సీరంను పరీక్షించడం ద్వారా ‘సార్స్ కోవిడ్’ ఇన్‌ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు.
ఈ వివరాలు తెలియడం ద్వార కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా లేదా అనేది తేలుతుందని, దాని ప్రకారం తదుపరి కార్యాచరణను రూపొందించడానికి ఐసీఎంఆర్, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖలకు స్పష్టత ఏర్పడుతుందన్నారు. జనసాంద్రత, వైరస్ వ్యాప్తి తదితరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలను, గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా ఏ వయసువారికి ఎక్కువగా వైరస్ సోకుతోంది, మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువగా అంటుకుంటోంది, ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది, ఎలాంటి సామాజిక పరిస్థితుల్లో ఉండేవారిపై ప్రభావం చూపుతోంది.. ఇలాంటి అనేక విషయాలు తెలుస్తాయన్నారు. ఒక్కో జిల్లాలో 60 మంది చొప్పున బృందాలు తిరుగుతున్నాయని, ఒక్కో బృందంలో ఒక సీనియర్ సైంటిస్టు, లేబొరేటరీ టెక్నీషియన్ తదితరులు కూడా ఉంటారన్నారు. రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నామని, అవసరమైతే మూడో రోజు కూడా చేస్తామని, చివరికి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
రోగ నిరోధక శక్తిని అంచనా వేస్తాం : డాక్టర్ లక్ష్మయ్య
ఇప్పటిదాకా కరోనా నిర్ధారణ పరీక్షల గురించి విన్నాంగానీ ఇప్పుడు ఆ వైరస్ శరీరంలోకి వచ్చిన తర్వాత తట్టుకోడానికి వారిలో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి ‘ఎలీసా’ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మయ్య తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రాండమ్ టెస్టులు నిర్వహించడానికి వచ్చిన ఆయన పట్టణంలోని నాల్గవ వార్డులోనూ, మాచారెడ్డి మండలంలోని భవానీపేటలో పలువురి నుంచి రక్త నమూనాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించారు. రాజంపేట్ మండలం తలమడ్ల, తాడ్వాయి మండలం ఎర్రపహాడ్, ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్‌లలో ప్రతి ప్రాంతంలో 10 మంది నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందాల్లో జిల్లా వైద్యాధికారితో పాటు ఎన్ఐఎన్ వైద్యులు, టెక్నికల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నిషీయన్‌లు కూడా పాల్గొంటున్నారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన టెస్టుల ఫలితాలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్‌లకు బదులుగా ఎలిసా టెస్టుల ద్వారా రోగ నిరోధక శక్తిని అంచనా వేస్తామని తెలిపారు. శనివారం మరో ఐదు క్లస్టర్‌లలో టెస్టులు జరుపుతామన్నారు.
జనగామ జిల్లాలో కూడా రక్త పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 2వ వార్డులో ఈ బృందాలు పర్యటించాయి. ర్యాండమైజేషన్ పద్దతిలో గుర్తించిన వారి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం జనగామ మున్సిపాలిటీలో ఒక వార్డును, జిల్లాలో 9 గ్రామాలను ఎంపిక చేశారు. ఒక్కో గ్రామం నుంచి 40 మంది నుంచి రెండు విడతల్లో 400 పరీక్షలు చేయనున్నట్లు బృందం కోఆర్డినేటర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలో సైతం పది గ్రామాలను, 400 మంది వ్యక్తులను ఎంపిక చేయనున్నారు. శుక్రవారం ఐదు గ్రామాల్లో 200 మందిని ఎంపి చేశారు. శనివారం మరో ఐదు గ్రామాల్లో ఇంకో 200 మందిని ఎంపిక చేసి వారి నుంచి రక్త నమూనాలను సేకరించనున్నారు.