రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2411 పాజిటివ్ కేసులు

by Shamantha N |
రికార్డు స్థాయిలో ఒక్కరోజే 2411 పాజిటివ్ కేసులు
X

– దేశంలో ఇప్పటిదాకా ఇదే అధికం
– కేరళ, హర్యానా తమిళనాడుల్లో పెరిగిన రికవరీ

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ అంక్షలను ప్రభుత్వం ఓ పక్క సడలిస్తుండగా.. మరో పక్క దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా శనివారం ఒక్క రోజే 2411 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఎక్కువ సంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమం. వారం రోజులుగా దాదాపు రెండు వేల మార్క్ వరకు కొత్త కేసులు నమోదవుతూ ఉన్నా.. శనివారం మాత్రం ఆ మార్క్‌ను దాటి 2411 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,776కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన రోగుల్లో దేశంలో ఇప్పటివరకు 10,018 మంది డిశ్చార్జి కాగా, శనివారం ఒక్కరోజే 954 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 71 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశం మొత్తం మీద ఇప్పటిదాకా 1223 కరోనా మరణాలు సంభవించాయి. శనివారం దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 790 ఉండగా, తమిళనాడులో 231, ఆంధ్రప్రదేశ్‌లో 62 కేసుల చొప్పున ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఒక్కరోజే వరుసగా 121, 29, 38 మంది చొప్పున డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 36 మంది, తమిళనాడులో ఒకరు చొప్పున మరణించారు.

కేరళ, హర్యానా, తమిళనాడుల్లో కరోనా సోకినవారిలో కోలుకుంటున్న వారి శాతం ఎక్కువగా ఉంటోంది. ఈ రాష్ట్రాల్లో వరుసగా రికవరీ రేటు 78.7%, 63.1%, 51.9% చొప్పున ఉంది. తమిళనాడులో వ్యాధి సోకిన 2526 మందిలో ఇప్పటివరకు 1312 మంది రికవరీ అయ్యారు. కేరళలో 498 మందికి పాజిటివ్ రాగా ఇందులో 392 మంది, హర్యానాలో 360 మంది పాజిటివ్ పేషెంట్లలో 227 మంది కోలుకున్నారు. దీంతో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య కన్నా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ:

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఊహించనంత వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటిదాకా దేశంలో నమోదైన మొత్తం 37,776 కేసుల్లో ఈ రాష్ట్రానికి చెందినవే 12,296 కేసులున్నాయి. శనివారం ఒక్కరోజే 790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు రెండు వేల మంది డిశ్చార్జి కాగా 521 మంది మరణించారు. శనివారం ఒక్కరోజే 36 మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేసే క్రమంలో రోడ్లమీదకు వస్తున్న సుమారు 60 వేల వాహనాలను సీజ్ చేయడంతో పాటు 89 వేల మందిపై కేసులు నమోదు చేసి 17 వేల మందిని అరెస్టు చేసినా వైరస్ వ్యాప్తిని మాత్రం ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ముంబయి నగరంలోనే ఎక్కువ ఉన్నాయి. నగరంలోని ధారవి అనే మురికివాడలో మొత్తం 496 కేసులు నమోదుకాగా 18 మంది మరణించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ రోజు సగటున 70 చొప్పున కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. శనివారం 62 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1525కు చేరుకుంది. చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న రాపిడ్ టెస్టులు, కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కొద్దిమంది పాత్రికేయులకు కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడ నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. కరోనా లక్షణాలను ఉన్నవారిని క్వారంటైన్‌కు వెళ్ళాల్సిందిగా సూచించిన అధికారులు పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

భారత్ :
మొత్తం కేసులు : 37776
మృతులు : 1223
రికవరీ : 10018

తెలంగాణ :
మొత్తం కేసులు : 1061
మృతులు : 29
రికవరీ : 499

ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 1525
మృతులు : 33
రికవరీ : 441

Tags: corona, india, saturday, cases

Advertisement

Next Story

Most Viewed