నిర్మల్‌లో కరోనా తుపాను.. ఒక్క రోజులో ఎన్ని కేసులో తెలుసా?

by vinod kumar |
Corona virus
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్నమొన్నటి వరకు అదుపులోనే ఉన్న కరోనా, ఇప్పుడు చేయి దాటిపోతోందా అనే అనుమానం కలుగుతోంది. ప్రతీ రోజు సరికొత్త రికార్డు నమోదవుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద నలుగురు కరోనా కారణంగా చనిపోగా కొత్తగా 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంత గరిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వారం రోజుల క్రితం దాకా సింగిల్ డిజిట్‌లోనే పాజిటివ్ కేసులు నమోదైన నిర్మల్ జిల్లాలో ఇప్పుడు 78కి చేరుకుంది. వారం రోజుల క్రితం కేవలం ఎనిమిది కేసులు మాత్రమే ఉన్నాయి. ఆదివారం సైతం ఐదు కేసులే నమోదయ్యాయి. సోమవారం సైతం తొమ్మిది కేసులు మాత్రమే నమోదుకాగా ఆ తర్వాతి రోజు ఒక్కసారిగా పెరిగి 30 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. మార్చి 31న జరిపిన పరీక్షలో ఏకంగా 78 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో చోటుచేసుకోవడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

నిర్మల్ జిల్లా తరహాలోనే నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోనూ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఆదివారం కేవలం తొమ్మిది కేసులు నమోదైతే మూడు రోజుల వ్యవధిలోనే అది 56 కేసులకు పెరిగింది. కామారెడ్డి జిల్లాలో సోమవార ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. జిల్లా వైద్యాధికారులు ఖుషీ అయ్యారు. వరుసగా రెండు రోజుల పాటు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడంతో అంతా అదుపులోకి వచ్చిందని భావించారు. కానీ మంగళవారం ఆరు కేసులు నమోదుకాగా బుధవారం నాటికి అది ఏకంగా 27 కొత్త కేసులు నమోదయ్యే స్థాయికి చేరుకుంది. నిజామాబాద్‌లో సైతం ఆదివారం కేవలం పది కొత్త కేసులు నమోదుకాగా మూడు రోజుల వ్యవధిలో మంగళవారం నాటికి ఒక్కసారిగా 48కి, బుధవారం నాటికి 45 కేసులకు చేరుకుంది. ములుగు జిల్లాలో మాత్రమే కొత్తగా నమదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త అదుపులో ఉన్నట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ గణాంకాలను చూస్తే స్పష్టమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు సైతం ఐదువేల మార్కు దాటింది. రెండు వారాల క్రితం వరకు దాదాపు రెండు వేల లోపు మాత్రమే ఉండగా ఇప్పుడు ఐదున్నర వేలకు చేరుకుంది. ఒకవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుండగానే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 201 కొత్త కేసులు నమోదుకాగా, నగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 79, రంగారెడ్డి జిల్లాలో 76 చొప్పున కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆరు రెట్ల మేర కరోనా కొత్త కేసులు పెరిగాయి. మరో రెండు మూడు రోజుల్లో వెయ్యిని దాటే అవకాశం ఉందని, నాలుగు అంకెల స్థాయికి చేరుకోవడంతో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలుత తీసుకోక తప్పదనే అభిప్రాయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed