ఆస్పత్రులు వద్దు.. హోం ఐసోలేషనే ముద్దు..!

by Shyam |
ఆస్పత్రులు వద్దు.. హోం ఐసోలేషనే ముద్దు..!
X

దిశ, మెదక్ : మెదక్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో గురువారం సాయంత్రం వరకు మొత్తంగా 1,579 కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కానీ అనధికారికంగా కేసుల సంఖ్య వేలల్లో ఉందని సమాచారం. దీంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. లక్షణాలున్న వారిలో చాలా మంది ఆస్పత్రికి వచ్చేందుకు వెనుకాడుతున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు..

మెదక్ జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి వరకు 1,579 కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. ఇప్పటి వరకు 617 మంది కరోనా నుంచి కోలుకోగా, 826 మంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.

మున్సిపాలిటీల వారీగా..

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటిల పరిధిలో 589 మందికి కరోనా సోకింది. మెదక్ మున్సిపల్ పరిధిలో 326, తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 184, రామాయంపేట్ మున్సిపల్ పరిధిలో 38, నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో 41 కేసులు నమోదయ్యాయి.

హోం ఐసొలేషన్‌లోనే చాలా మంది..

కరోనా లక్షణాలు కలిగిన వారు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 826 మంది హోమ్ ఐసొలేషన్‌లో ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే మెదక్ వెలుగు పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు తక్కువగా ఉన్న వారిని, ఇతర జబ్బులు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారందరికీ ప్రభుత్వం తరపున వచ్చే కిట్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో విటమిన్ సీ, డీ, అజిత్రో మైసైన్, పారాసెటమాల్, జింక్, ఏసీ క్యూ మాత్రలు ఉన్నాయి. వీటితో పాటు శానిటైజర్, మాస్కులు కూడా అధికారులు అందజేస్తున్నారు. జిల్లాలో 2500 హోమ్ ఐసొలేషన్‌ కిట్స్ అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇంటి వద్దకే వెళ్లి చికిత్స..

జిల్లాలో వైరస్ పడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ చాలా వరకు బాధితులు హోమ్ ఐసొలేషన్‌లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి ఇంటి వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఐసోలేషన్ కిట్స్ సరిపడా ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, DMHO

Advertisement

Next Story

Most Viewed