- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బెడ్‌లు ఫుల్.. ఆక్సిజన్ నిల్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా లేదని, దీన్ని పెంచాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రధాని మోడీకి విజ్జప్తి చేశారు. ప్రధాని ఆదేశం మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పందించి కోటాను పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ అది ఇంకా ఆచరణలోకి రాలేదు. దీంతో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అవసరానికి తగినంత సరఫరా లేకపోవడంతో బెడ్‌లు ఉన్నా పేషెంట్లకు అడ్మిషన్లు దొరకడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు అన్ని ప్రైవేటు ఆస్పత్రులూ కొవిడ్ వార్డులను ఏర్పాటుచేశాయి. కానీ బెడ్‌ల సంఖ్యకు, పేషెంట్ల అవసరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరాను చేయలేకపోతోంది.
హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కేవలం ఆక్సిజన్ అందని కారణంగా రోజుకు పదుల సంఖ్యలో పేషెంట్లు చనిపోతున్నారు. ఆస్పత్రిలో బెడ్ దగ్గరకు చేరకముందే ఆవరణలో తనువు చాలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బెడ్ దొరికేంత వరకు అంబులెన్స్‌లోనే ఉండిపోతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో ఆస్పత్రి కారిడార్‌లోనే చనిపోతున్నారు. బెడ్‌లు ఉన్నా దానికి తగినంత ఆక్సిజన్ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ’బెడ్‌లు ఖాళీ లేవు’ అంటూ తిప్పి పంపిస్తున్నాయి. కేవలం ప్రాణవాయువు అందని కారణంగా ఒడిలోనే చనిపోతున్న హృదయ విదారక దృశ్యాలు రాష్ట్రంలో నిత్యకృత్యం అయ్యాయి.
సెకండ్ వేవ్‌లో పెరిగిన డిమాండ్
గతేడాది కరోనా తొలి వేవ్ సందర్భంగా ఆక్సిజన్ డిమాండ్ పెద్దగా లేకపోయినా ఈసారి మాత్రం ఊహకు అందని విధంగా పెరిగింది. రాష్ట్రంలో ప్రతీ రోజు ఉత్పత్తి అయ్యే 150 టన్నులు సరిపోవడంలేదు. చాలా మంది పేషెంట్లకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వారికి ఆక్సిజన్ బయట నుంచి అందించాల్సి వస్తోంది. దీంతో డిమాండ్ దాదాపు 550 టన్నుల దాకా ఏర్పడింది. దీంతో కర్నాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాల్సి వస్తోంది. అయితే రవాణాకు పట్టే సమయం ఎక్కువగా ఉంటుండడంతో అవసరానికి తగినంతగా లభ్యం కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం రోజుకు 600 టన్నుల మేర సమకూర్చనున్నట్లు చెప్పినా ఆచరణలో అది 430 టన్నులు దాటడంలేదు.
ఆస్పత్రి బెడ్‌లను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం కేంద్రీకృత విధానాన్ని అమలుచేసినట్లయితే అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను పద్ధతి ప్రకారం వినియోగించుకోడానికి వీలుండేది. కానీ సిలిండర్ల రూపంలో గృహావసరాలకు సైతం వినియోగిస్తుండడంతో ఆస్పత్రుల్లోని బెడ్‌లకు సరిపోవడంలేదు. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్ వార్డుల్ని ఏర్పాటుచేయడంతో ఇంతకాలం ఆక్సిజన్ అవసరం లేని ఆస్పత్రులు కూడా ఇప్పుడు సమకూర్చుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రైవేటు మార్కెట్‌లో అవసరానికి తగినంత దొరకడం లేదు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆక్సిజన్‌లో సగానికి పైగా ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే చేరుతున్నట్లు అంచనా. కానీ బెడ్‌లు, వాటిల్లోని పేషెంట్ల సంఖ్యను పరిశీలిస్తే రాష్ట్రంలో ఒక వంతు మంది మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లో ఉంటే మిగిలిన రెండొంతుల మంది కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఆక్సిజన్ సరఫరా మాత్రం పేషెంట్ల అవసరాలకు అనుగుణంగా పంపిణీ కాకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్‌లో కొంటున్నాయి. చివరకు ఆ భారం పేషెంట్లపై పడుతోంది.
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్ని సాకుగా చూపి కొన్ని రీఫిల్లింగ్ కంపెనీలు, స్టాకిస్టులు కంటికి తెలియని విధంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో లీటరు ఆక్సిజన్ రూ. 6.25 చొప్పున విక్రయించగా ఇప్పుడు కొరత కారణంగా రూ. 70కు పెరిగింది. అయినా ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువ ధరకు కొనక తప్పడంలేదు. ఈ అధిక ధర అనివార్యంగా పేషెంట్‌పైన పడుతోంది. ఫలితంగా కరోనా ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆక్సిజన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసే యంత్రాంగాన్ని నెలకొల్పితే ఈ కొరతను నివారించవచ్చని ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు ఒకరు తెలిపారు.
బెడ్‌లు ఉన్నా సిలిండర్లు లేవు
రాష్ట్రంలో సెకండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచింది. గతేడాది తొలి వేవ్ సందర్భంగా కేవలం 18 వేల బెడ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటే ఈసారి అది ఏకంగా 53 వేలకు పెరిగింది. ఇందులో దాదాపు సగం వరకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు ఉన్నాయి. కానీ ఆక్సిజన్ సరఫరా లేని కారణంగా కొన్ని చిన్న ప్రైవేటు ఆస్పత్రులు, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోని బెడ్‌లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీంతో శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25,701 ఆక్సిజన్, ఐసీయూ బెడ్‌లు ఉన్నాయి. ఇందులో 18,899 బెడ్‌లలో మాత్రమే పేషెంట్లు ఉన్నారు. ఆక్సిజన్ ఉంటే మరణాలను నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు.
సాధారణంగా ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్లకు గంటకు రెండు లీటర్లను వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా సంబంధిత సమస్యలతో వస్తున్న పేషెంట్లకు కనీసంగా ఐదు లీటర్లను వినియోగించాల్సి వస్తోంది. ఇక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లకు గంటలకు కనీసంగా 15 లీటర్లను, ’హై ఫ్లో’ అవసరం ఉన్న పేషెంట్లకు సగటున 50 లీటర్లను వినియోగించాల్సి వస్తోంది. అసలే ఆక్సిజన్‌కు కొరత ఉన్న నేపథ్యంలో వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్లకు ఆక్సిజన్‌ను ఆ మోతాదులో సమకూర్చలేని పరిస్థితుల్లో చాలా ప్రైవేటు ఆస్పత్రులు అడ్మిషన్లను నిరాకరిస్తున్నాయి. మామూలు ఆక్సిజన్ వార్డులో పది మంది పేషెంట్లకు అవసరమయ్యే ఆక్సిజన్‌ను వెంటిలేటర్ మీద ఉండే ఒక్క పేషెంట్ వినియోగించుకునే పరిస్థితి ఉన్నందున చేర్చుకోడానికి ఆసక్తి చూపడంలేదు.
రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్‌లు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో : 4,885
ప్రస్తుతం ఉన్న పేషెంట్లు : 3,497
ప్రైవేటు ఆస్పత్రుల్లో : 11,081
ప్రస్తుతం ఉన్న పేషెంట్లు : 8,091.
వెంటిలేటర్లు / ఐసీయూ..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌లు : 1,817
పేషెంట్ల సంఖ్య : 1,307
ప్రైవేటు ఆస్పత్రుల్లో : 7,918
పేషెంట్ల సంఖ్య : 6,004.