వృద్ధురాలిపై దాడిచేసి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు

by Sridhar Babu |
వృద్ధురాలిపై దాడిచేసి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ,తిరుమలాయపాలెం : ఓ వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెలో ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఆరేంపుల వెంకటమ్మ (75) కుమారుడు శ్రీనివాస్ ఖమ్మంలో నివసిస్తున్నాడు. దాంతో వృద్ధురాలు వెంకటమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లో చొరపడి, వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు నగలను చోరీ చేసేందుకు యత్నించారు.

దీంతో ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న రాయితో నుదుటిపై కొట్టి నగలు ఎత్తుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నగల విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి తలకు బలమైన గాయం కావడంతో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు వృద్ధురాలి కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు నిమిత్తం ఎస్సై కూచిపూడి జగదీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed