కరోనా సెలవులు… కారాదు ఆటవిడుపు!

by Aamani |
కరోనా సెలవులు… కారాదు ఆటవిడుపు!
X

దిశ, ఆదిలాబాద్: దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల గురించి విన్నాం. ఇదేంటి కరోనా సెలవులట..! అవును మొన్న కేరళ, నిన్న ఢిల్లీ, నేడు తెలంగాణ ప్రభుత్వం.. విద్యా సంస్థలకు 15రోజుల సెలవులు ప్రకటించింది. స్వయంగా సీఎం కేసీఆరే ఈ ప్రకటన చేశారు. వారం ముందు పారాసిటామోల్‌తో పోయే దానికి ఇంత బొబ్బ దేనికి అన్న ఆయనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. కారణం..! ఆరోగ్యశాఖ, ఆంతరంగిక వర్గాలు చేరవేసిన సమాచారమూ కావచ్చు. నిజమే ఇప్పుడు కరోనా వణికిస్తున్నది. రాష్ట్రంలో ఒకటి, రెండు, మూడు ఇలా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ప్రపంచంలో 200 పైచిలుకు దేశాలుంటే 149దేశాల్లో కరోనా వైరస్ బయటపడింది. ఇక ఆరేడు దేశాల్లో అయితే కరోనా విలయతాండవం చేస్తుంది. దీని బారిన పడి పదులు, వందలు క్రమంగా వేల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. దీన్నిబట్టి కరోనా ఏ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెడుతున్నదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా జాగ్రత్తపడాలి. అందుకే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సినిమా హాళ్లు, పబ్బులు, పార్కులను నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో బడి పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, టీచర్లు ఇలా అన్నివర్గాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడిపిల్లలకు ఇచ్చిన సెలవులు ఆటవిడుపు కోసం కాదన్న విషయాన్ని చెప్పాల్సిన సందర్భం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇల్లు విడిచి బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎక్కడా జనం గుంపులుగా ఉండకుండా జాగ్రత్త పడడం‌తో పాటు, కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది.

చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని జనం ఈ పరిస్థితుల్లో బంధుమిత్రులతో మాట్లాడే టైంలో కరోనా వైరస్ నివారణోపాయాలపై సలహా ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ వ్యాధి వేగంగా ప్రబలే అవకాశం ఉన్నందున సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత తగ్గేదాకా అన్ని వర్గాలు సాధ్యమైనంత మేర ఇళ్ల వద్దనే ఉండే ప్రయత్నం చేయాలి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన సెలవులను ఆటవిడుపు కోసం కాదన్న విషయాన్ని అందరికీ వివరించి కరోనా నివారణకు ప్రయత్నించాలి.

Advertisement

Next Story

Most Viewed