కరోనా ఎఫెక్ట్.. టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా

by Anukaran |
కరోనా ఎఫెక్ట్.. టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. ప్రతి ఏటా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జెండాను తెలంగాణ భవన్‌లో ఎగురవేస్తారు. కరోనాతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా దూరమయ్యారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావు జెండా ఎగురవేయనుండగా, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు. కరోనా దృష్ట్యా పార్టీ ముఖ్యులు మాత్రమే పాల్గొంటున్నట్లు నేతలు తెలిపారు.

రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పంజా విసురుతోంది. ఈ సమయంలో ఈనెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లీనరీ నిర్వహిస్తుంటారు. ఈ ఫ్లీనరీకి రాష్ట్రంలోని మండల, జిల్లా నేతలు, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఫిబ్రవరి 7న నిర్వహించిన పార్టీ ముఖ్యుల సమావేశంలో కేసీఆర్ పిలుపునిచ్చారు. 6 లక్షల మందితో నిర్వహించాలని భావించారు. కానీ, కరోనా విజ‌ృంభనతో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం సబబు కాదని భావించిన పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ రద్దు చేశారు. దీంతో 2019, 2020, 2021లో వరుసగా మూడోసారి వాయిదా పడినట్లయింది. దీంతోపార్టీ పదవులు ఆశిస్తున్నవారికి కొంత నిరాశే మిగిలింది.

జెండా ఎగురవేయనున్న కేకే

ఈనెల 19న సీఎం కేసీఆర్‌‌కు, 23న మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ఇద్దరు ఐసోలేషన్‌లో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ దూరం కావడంతో తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావు జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. జిల్లా, మండల, పట్టణ, గ్రామాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ముఖ్యులు మాత్రమే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఈ సారి ఆవిర్భావ వేడుకలు సాదాసీదాగా నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed