నెలరోజుల్లో రూ.33 లక్షల కోట్లు హాంఫట్!

by Shyam |
నెలరోజుల్లో రూ.33 లక్షల కోట్లు హాంఫట్!
X

దిశ, వెబ్‌డెస్క్: కార్పొరేట్ పన్ను తగ్గింపులు, మూడో త్రైమాసిక ఫలితాలతోపాటు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశీయ మార్కెట్లకు భారీ నష్టం తప్పలేదు. గత నెల రోజుల వ్యవధిలో మార్కెట్లో మదుపర్ల సొమ్ము రూ. 33.08 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 12న సెన్సెక్స్ 41,565 వద్ద ముగిసింది. ఆ రోజుకు బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.159.66 లక్షల కోట్లు. గురువారంతో సెన్సెక్స్ 33,249కు పడిపోయింది. ప్రస్తుతం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.126.58 లక్షల కోట్లు. కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలో సుమారు 8,400పైగా పాయింట్లు క్షీణించాయి. ఇక, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ గత నెల 12న 12,201 వద్ద ఉండగా, గురువారానికి 2,433 పాయింట్లు నష్టపోయి 9,750 కి పడిపోయింది.

చైనాలో పుట్టి అంతర్జాతీయంగా 107 దేశాలకు పాకిన కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది. గత నెలలో ఇండియాలోకి వచ్చిన కరోనా వైరస్ దేశీయ మార్కెట్లను కోలుకోలేకుండా చేస్తోంది. యూఎస్ మార్కెట్లు సైతం కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు వేగవంతమైన చర్యలను మొదలుపెట్టింది. డోజోన్స్ ఫిబ్రవరి 12న 29,551 పాయింట్లు ఉండగా, గురువారానికి 23,533కు పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందనేలా 6 వేలకు పైగా పాయింట్లను డోజోన్స్ మార్కెట్ కోల్పోయింది. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే ఆందోళనతో యూఎస్ మార్కెట్లకు అనుగుణంగా ఆసియా మార్కెట్లన్నీ బలహీనస్థాయిలోకి పడిపోయాయి.

ఇటీవల చమురు ఉత్పత్తి విషయంలో సౌదీ, రష్యా దేశాల మధ్య మొదలైన చమురు యుద్ధం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఒకవైపు మార్కెట్లు పతనమవుతుంటే.. మరోవైపు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా ఉన్న కమొడిటీలు కూడా పతనం వైపునకే చూస్తుండటం మదుపర్లకు ఆందోళంగా ఉంది. చమురు, బంగారం ధరలు కూడా నెమ్మదిగా క్షీణిస్తున్నాయి. చమురు ఉత్పత్తిని ఇంకా పెంచుతామని ఆరామ్‌కో బుధవారం ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు శుద్ధి పరిశ్రమల షేర్లు భారీగా కుదేలయ్యాయి. బుధవారం ఒక్కరోజే చమురు ధరలు ఏకంగా 6 శాతానికిపైగా పడిపోయాయి. దేశీయంగా చమురు శుద్ధి పరిశ్రమల్లో అత్యధికవాటా ఉన్న రిలయన్స్ షేర్ 5 శాతానికి పైగా కృంగిపోయింది. మిగిలిన అన్ని సూచీల కంటే రిలయన్స్ సూచీ అత్యంత ప్రధానమైన షేర్ అవ్వడంతో మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. రిలయన్స్‌తోపాటు మరో సంస్థ ఓఎన్‌జీసీ షేర్ కూడా 8 శాతం కంటే అధికంగా నష్టాన్ని మూటగట్టుకుంది. చమురు ధరలు తగ్గే కొద్దీ ఆయా కంపెనీల లాభాలు ఆవిరయ్యే పరిస్థితి ఉండటంతో మదుపర్లు భారీగా అమ్మకాలకు సిద్ధమయ్యారు.

సాధారణంగా మార్కెట్లు పతనమయ్యే సమయంలో మదుపర్లు ప్రత్యామ్నాయంగా బంగారంపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వేగంగా వ్యాపిస్తున్న కరోనా ధాటికి బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. దీంతో మదుపర్లలో భయం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, భవిష్యత్తులో బంగారం, చమురు ధరలు మళ్లీ పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1,21,654 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 4,373 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక ఇండియాలో ఇప్పటివరకూ 70 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Tags: Indian Markets, Corporate Tax Cuts, Q3 Earnings, Coronavirus, Sensex, Nifty, US Market, Coronavirus Fear

Advertisement

Next Story