- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లగ్న పత్రికెందుకు..? మమా అనిపిస్తే సరిపోతది
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పెండ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే తంతు. ఈ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకునేందుకు పేద, మధ్య, ధనిక వర్గాలు తపనపడుతుంటాయి. ఇంత గొప్ప క్రతువు లగ్న పత్రికతోనే మొదలవుతుంది. వందల మంది మధ్య జరిగే కల్యాణం నేడు కరోనా మహమ్మారి పుణ్యమా అని వివాహం పది, ఇరవై మంది మధ్యే మమా అని పిస్తున్నారు. దీంతో లగ్న పత్రికల ఊసే లేకుండా పోయింది. ఏడాది ఖర్చులు ఒక్క పెండ్లిండ్ల సీజన్ లో సంపాదించుకునే పెండ్ల పత్రికల వ్యాపారాలు డీలా పడిపోయారు. లాక్ డౌన్ మొదలైన రోజు నుంచి ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు జరిగే వ్యాపారాలు దెబ్బతిన్నట్లు అంచనా.
పెళ్లి ముహూర్తాల సీజన్లో శుభలేఖల వ్యాపారం జోరుగా సాగుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ వ్యాపారాలు పతాక స్థాయిలో ఉంటాయి. సరిగ్గా వివాహాల సీజన్ మొదలయ్యే నాటికి కరోనా ప్రభావం పెరిగింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో దుకాణాలు మూయక తప్పని పరిస్థితి. సాధారణంగా శుభకార్యాలు జరిగే ఈ మూడు నెలల్లో జరిగే పెండ్లి పత్రికల విక్రయాలతో వచ్చే లాభాలు దుకాణం కిరాయిలు, పని చేసే వారి జీతాలు ఇలా ఏడాది ఖర్చులు వెళ్లిపోతాయి. అయితే నేడు పరిస్థితులు మారాయి. మూడు నెలల పాటు దుకాణాలు మూసి వేశారు. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచి పోగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆయా వ్యాపారాలపై ఆంక్షలు తొలగించినప్పటికీ పెండ్లి పత్రికలు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెండ్లండ్లకు పరిమిత సంఖ్యలో హాజరు కావాలనే కఠిన నిబంధనలు అమలులో ఉండడంతో ఎవరూ 50 నుంచి 100 కార్డుల కంటే ఎక్కువ కొనుగోలు చేయడం లేదు. దీంతో పెండ్లి పత్రికల విక్రయాల దుకాణాదారులకు ఏమి చేయాలో తెలియక దుకాణాలు శాశ్వతంగా మూసి వేస్తుండగా మరి కొంత మంది పని వాళ్లను తొలగిస్తున్నారు.
వెలవెలబోతున్న గౌలిగూడ..
హైదరాబాద్ నగరంలోని గౌలిగూడ మార్కెట్ పెండ్లి పత్రికల విక్రయాలకు ఎంతో పేరు పొందింది. ఇక్కడ వందకు పైగా దుకాణాలు ఉండగా వెయ్యి మందికి పైగా కార్మికులు మార్కెట్ ను నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ మార్కెట్ కేవలం నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి జిల్లాల నుంచి సైతం వచ్చి పత్రికలు కొనుగోలు చేస్తుంటారు. సీజన్ లో చాలా రద్దీగా ఉంటుండగా వ్యాపారం కూడా రూపాయలు కోట్లలో జరుగుతుంటుంది. ఇంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రం కరోనా దెబ్బతో విలవిలలాడుతోంది.
కోలుకోలేని దెబ్బ: రవీందర్ యాదవ్, వ్యాపారి
గౌలిగూడ మార్కెట్ లో ఐదు దుకాణాలు ఉండగా సుమారు 50 మంది పని చేస్తున్నారు. కరోనా ప్రభావంతో నిర్వహణ భారం పెరిగింది. దీంతో ఓ దుకాణాన్ని ఇప్పటికే తీసి వేశా. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో శుభకార్యాల సీజన్. అప్పుడు కరోనా ప్రభావంతో దుకాణాలు మూసి వేయాల్సి వచ్చింది. గిరాకీ లేక దుకాణాల అద్దెలు, గుమస్తాల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, మార్కెట్ మొత్తం ఉంది. ఇలానే మరికొన్ని నెలలు గడిస్తే ఇక్కడి వ్యాపారులంతా ప్రత్యామ్నాయ వెతుక్కోక తప్పదు. ఇప్పటికే మార్కెట్ లో 25 శాతం దుకాణాలు మాత్రమే తెరుస్తున్నారు.